‘సిట్’నే సిట్ అంటోన్న ప్రభాకర్ రావు
తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి, గతంలో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్‌గా పని చేసిన ప్రభాకర్‌రావు విచారణలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం.;
తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి, గతంలో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్‌గా పని చేసిన ప్రభాకర్‌రావు విచారణలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా అమెరికాలో ఉన్న ఆయనను ట్రాన్సిట్ వారెంటుతో హైదరాబాద్‌కు తీసుకొచ్చి సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నెల 9, 11, 14, 19, 20 తేదీల్లో విచారణకు హాజరయ్యారు. శుక్రవారం సుమారు 8 గంటల పాటు ప్రశ్నించినప్పటికీ ఆయన నుంచి నిర్దిష్ట సమాచారం రాబట్టలేకపోయారు.
-సూటిగా ఎదురుప్రశ్నలు
విచారణలో సిట్ అధికారులు కీలక ప్రశ్నలు సంధించినప్పటికీ ప్రభాకర్‌రావు వాటికి సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశించినవారు ఎవరూ? ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో? ఎందుకు చేశారో? దీని వల్ల ఎవరికీ లాభం జరిగిందో? అనే ప్రశ్నలకు ఆయన ఏదీ ఖచ్చితంగా చెప్పలేదట. పైగా “నాకు గుర్తు లేదు”, “ఎవరో చెప్పినట్టు నేను ఎందుకు చేస్తాను?”, “నాకు చట్టం తెలియదా?” అంటూ ఎదురు ప్రశ్నలతో అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నట్టు సమాచారం.
-సిట్ నిరాశ
ఇప్పటి వరకు ఇతర నిందితుల నుంచి వచ్చిన వివరాలను ఆయన ఎదుట ఉంచి సిట్ అధికారులు ప్రశ్నించినప్పటికీ ప్రభాకర్‌రావు వాటిని కూడా ఖండించడమే చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు ఆయనపై కోపంగా ఉన్నారు. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించకపోవడంతో ఆయనను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
-కోర్టుకు నివేదిక
ప్రభాకర్‌రావు విచారణ వివరాల నివేదికను సిట్ త్వరలో కోర్టుకు సమర్పించనున్నట్టు సమాచారం. ఈ నివేదికలో ఆయన సహకరించకపోవడం, సరైన సమాధానాలు ఇవ్వకపోవడం, దర్యాప్తును దెబ్బతీసేలా ప్రవర్తించడాన్ని స్పష్టంగా పేర్కొననున్నట్టు తెలుస్తోంది. దీనితో ఆయనకు ఇప్పటివరకు లభిస్తున్న కోర్టు ఉపశమనం తొలగించి, అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులు కోరే అవకాశం ఉంది.
-మరిన్ని ముడులు విప్పాల్సిన అవసరం
ఈ కేసులో ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతర నిందితులైన ప్రణీత్ రావు వంటి వారి ద్వారా సమర్పించిన సమాచారం ఆధారంగా ప్రభాకర్‌రావును ప్రశ్నించినప్పటికీ ఆయన నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఈ కేసులో ఇంకా చాలా ముడులు విప్పాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఈ విచారణ ఏ దిశగా పోతుందో, ప్రభాకర్‌రావు స్పందనలపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.