బాబు పవన్ ఇద్దరినీ కలిపి ఓడిస్తేనే మజా !
ఏపీలో పాలిటిక్స్ వెరీ క్లియర్. వైసీపీది సోలో ఫైట్. అందులో రెండవ మాట లేదు. ఎవరితోనూ పొత్తులు ఉండవు, తాముగానే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఆ పార్టీ ఉంది.;
ఏపీలో పాలిటిక్స్ వెరీ క్లియర్. వైసీపీది సోలో ఫైట్. అందులో రెండవ మాట లేదు. ఎవరితోనూ పొత్తులు ఉండవు, తాముగానే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. ఇక అధికారంలో ఉన్న టీడీపీ చూస్తే జనసేనతో పొత్తు పెట్టుకుంది. అలాగే బీజేపీతో పొత్తు ఉంది. ఒక్క వైసీపీని తప్ప ఎవరినీ ప్రత్యర్థిగా చూడలేని ఉదారత కూడా టీడీపీకి ఉందని సెటైర్లు ఉండనే ఉన్నాయి. మరో వైపు చూస్తే తమ పొత్తు ఏకంగా పదిహేనేళ్ళ పాటు అని పవన్ పదే పదే చెబుతారు. 2029 లో ఇదే కూటమితో వస్తామని చంద్రబాబు కూడా అంటూంటారు. ఇక ఏపీలో బీజేపీకి పొత్తు లేకపోతే కమల వికాసమే లేదు అన్నది కూడా ఉన్న మాట. ఈ నేపథ్యంలో ఆకాశం బద్ధలైపోయినట్లు గా అద్భుతాలు ఏవీ జరగవు అని అంటున్నారు.
వీడిపోయేది ఉండదుగా :
ఏపీలో కూటమి మధ్య చిచ్చు పెడదామని వైసీపీ అనుకున్నా అది జరిగేది ఉండదని రాజకీయం తెలిసిన వారి మాట. అయితే 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన రాజకీయం చూస్తే మూడు పార్టీలు విడిపోయి ఒంటరిగా పోటీకి దిగాయి. దాంతో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టింది. మరి ఆ తప్పు తెలుసుకున్న మూడు పార్టీలు ఎప్పటికీ ఒకే గూటిని వీడవు కదా అని అంటున్నారు విడిపోతే పడిపోతామని తెలిసిన తరువాత కూడా ఇంకా విడాకుల మాట అంటే కనుక అది రాజకీయంగా తప్పుడు వ్యూహం అవుతుంది అని అంటున్నారు. అన్నీ తెలిసిన వారు అపర చాణక్యులు కూటమిలో ఉన్నారు. అందువల్ల కూటమి పార్టీలు అన్నీ 2029లోనూ కలసికట్టుగానే వస్తాయని అంటున్నారు. విడిపోయే సీన్ అక్కడ అయితే లేదు, మరి విడగొట్టే చాతుర్యం ఏమైనా వైసీపీకి ఉందా అంటే వైసీపీకి ఆ తరహా వ్యూహాలు తెలిస్తే కనుక 151 సీట్ల నుంచి 11కి ఎందుకు పడిపోతుంది అన్న మాట కూడా వెంటనే వస్తుంది.
మజా కావాలంటే :
ఇదిలా ఉంటే ఒక టీవీ చానల్ డిబేట్ లో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమిని వైసీపీ విడగొడుతుందా అలాంటి రాజకీయం చేస్తుందా అన్న దానికి ఆయన బదులిస్తూ వారు విడిపోయే ప్రసక్తే ఉండదని పక్కా క్లారిటీతోనే చెప్పారు. ఎందుకు అంటే జగన్ భయం అన్నారు. జగన్ భయంతోనే చంద్రబాబు పవన్ కలిశారు కానీ మరేమీ కాదని నాని చెబుతున్నారు. అంతే కాదు కూటమి పార్టీలు పొత్తుని ఎప్పటికీ చిత్తు చేసుకోరని అన్నారు. తాము కూడా వారిని విడగొట్టే ప్రయత్నం చేయమని అంటున్నారు. అయితే వారు విడిపోతే గెలిచే గెలుపులో వైసీపీకి మజా ఏముంది అని ఆయన అంటున్నారు. చంద్రబాబు పవన్ కలిసి ఉంటేనే వారు కూటమిగా వచ్చి ఎదురు నిలిస్తేనే వారిని ఓడించి మరీ అధికారంలోకి రావడంలోనే మజా ఉంది అని పేర్ని నాని అంటున్నారు.
ఫిక్స్ అయినట్లేనా :
ఏపీలో రాజకీయం చూస్తే అలాగే ఉంది. కూటమి విడిపోదు సరికదా 2029 నాటికి ఇంకా ఏదైనా కొత్త పార్టీలు వచ్చినా చేర్చుకుంటుంది అని అంటున్నారు. సో ఆ విధంగా కూటమి ఉంటే వైసీపీ స్ట్రాటజీ ఏమిటి అంటే దానికి నాని చెప్పిన జవాబే ఇది అనుకోవాలి. కూటమి ఎంత పటిష్టంగా ఉన్నా అంతా కలసే వచ్చినా కూడా 2029 ఎన్నికల్లో ఓడించి వైసీపీ మజా ఏంటో తాను జనాలకు చూపిస్తుంది అని ఆయన ధీమాగానే ఉన్నారు. సో వైసీపీకి ఈ విషయంలో ఫుల్ క్లారిటీ అయితే ఉంది అన్న మాట. అయినా రాజకీయాల్లో పొత్తులు ఎపుడూ గెలుపే ఇస్తాయన్నది పొరపాటే. ఓటమిని కూడా తెస్తాయి. దానికి 2004, 2009లో టీడీపీ ఉమ్మడి ఏపీలో పెట్టుకున్న పొత్తులే ఉదాహరణ అని చెబుతారు. మరి వైసీపీ లెక్కలు కూడా అవే కావచ్చు. ఈ కూటమి మాకు వద్దు అనుకుంటే జనాలు నిర్ణయించుకుంటే ఎంత మంది వచ్చినా ఓటమి తప్పదు, మరి ఆ పరిస్థితి కోసం వైసీపీ ఎదురుచూస్తోంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి మీద ఉంది. అంటే పొత్తులతో కాదు జనాలను హత్తుకుని మంచి పనులు చేయడం ద్వారానే అది సాధ్యం అని అంటున్నారు.