పేర్ని నాని.. ఆవేశం పని చేస్తుందా ..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం రాజకీయాలు సలసలా మరుగుతున్నాయి. మాజీమంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పేరుని నాని, అదేవిధంగా ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న టిడిపి సీనియర్ నాయకులు కొల్లు రవీంద్ర మధ్య రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కాయి.;
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం రాజకీయాలు సలసలా మరుగుతున్నాయి. మాజీమంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పేరుని నాని, అదేవిధంగా ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న టిడిపి సీనియర్ నాయకులు కొల్లు రవీంద్ర మధ్య రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కాయి. ఉద్దేశపూర్వకంగానే తమను వేధిస్తున్నారని తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మంత్రి పై పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు బియ్యం అక్రమాలకు సంబంధించి తన సతీమణిని సిఐ దూషించారని దీంతో తను మానసికంగా చచ్చిపోయానని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
సాధారణంగా మచిలీపట్నం రాజకీయాలు గడిచిన దశాబ్ద కాలంగా వాడి వేడిగానే సాగుతున్నాయి. గతంలో పరిస్థితి ఎలా ఉన్నా వైసిపి హయాంలో మంత్రి గా ఉన్న పేర్ని నాని.. అప్పటి మాజీ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర పై అక్రమంగా కేసు బనాయించా రని, ఆయనను అరెస్టు కూడా చేయించారని పెద్ద ఎత్తున టిడిపి నాయకులు ఉద్యమించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇరుపక్షాల మధ్య రాజకీయాలు జోరుగానే సాగుతున్నాయి .తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతర నియోజకవర్గాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో అటు కొల్లు రవీంద్ర కొంత సమయమనం పాటిస్తున్నారు అని చెప్పొచ్చు.
ఎందుకంటే బలమైన కేడర్ ఉండడం ప్రజల్లో ఒక మంచి నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్న కారణంగా స్థానికంగా దూకుడు ప్రదర్శించకుండా చాలా ఆలోచించి అడుగులు వేస్తున్నారు. ఇక అధికారం కోల్పోయిన పరిస్థితి, రెండోది స్థానికంగా క్యాడర్ దూరంగా ఉండటం గత ఎన్నికల్లో తన కుమారుడికి ఆశించిన విధంగా ఓట్లు రాకపోవడం వంటి కారణాలతో పేర్ని నాని సతమతం అవుతున్నారనేది వైసీపీలోనే జరుగుతున్న చర్చ. దీనికి తోడు పార్టీ పరంగా కూడా ఆయనకు పెద్దగా బలం కనిపించడం లేదని సీనియర్ నాయకులు అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
సహజంగా పేర్ని నాని అంటే బలమైన కాపు సామాజిక వర్గంలో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా గడిచిన ఐదు సంవత్సరాలు ఆయన వ్యవహరించారు. అయితే పవన్ కళ్యాణ్ ని దూషించటం, సవాళ్లు విసరడం మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వంటివి కాపు సామాజిక వర్గంలో పేర్ని నానిని దూరం పెట్టాయి. ప్రస్తుతం ఈ ప్రభావం పేర్నిపై ఎక్కువగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో ఆ ఒత్తిడి, ఇటువైపు రాజకీయంగా ఎదురవుతున్న దెబ్బలు కారణంగా పేర్ని నాని కాస్త సమయమును కోల్పోతున్నారా అనేది సందేహంగా మారింది.
ఏదేమైనా మచిలీపట్నం నియోజకవర్గంలో అంతర్గతంగా, అదేవిధంగా బహిర్గతంగా కూడా పేర్ని నాని- కొల్లు రవీంద్రల మధ్య రాజకీయ పోరాటం తీవ్రస్థాయిలో సాగుతోందని చెప్పాలి. మరి దీనికి పుల్ స్టాప్ పడుతుందా లేక వచ్చే నాలుగు సంవత్సరాలు మరింత జోరుగా కొనసాగుతుందా అనేది చూడాలి. కానీ, నానీ ఆవేశం రాజకీయంగా ఇబ్బందికి గురి చేస్తుందని అంటున్నారు.