కొడాలి రిటైర్మెంట్..?! ముహూర్తం ఫిక్స్.. వారసుడి ఎంట్రీపై పేర్ని సంకేతాలు
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? వైసీపీ కార్యకర్తలు, మాజీ మంత్రి కొడాలి అభిమానులకు షాకింగ్ లాంటి ఈ సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? వైసీపీ కార్యకర్తలు, మాజీ మంత్రి కొడాలి అభిమానులకు షాకింగ్ లాంటి ఈ సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కొడాలి వారసుడు వచ్చేస్తున్నాడంటూ వైసీపీకే చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించడం విస్తృత చర్చకు దారితీసింది. అయితే పేర్ని నిజంగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి? అంటూ పలువురు ఆరా తీస్తున్నారు. అయితే కొడాలి రిటైర్మెంట్ తీసుకోవడం ఖాయమే కానీ, ఆ ముహూర్తానికి మరికొన్నేళ్లు సమయం పడుతుందని పేర్ని ట్విస్ట్ ఇచ్చారు.
మాజీ మంత్రి కొడాలి వారసుడు అంటూ ఆయన తమ్ముడు కొడుకు కొడాలి అర్జునరావు పేరును మాజీ మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా 2034 ఎన్నికల్లో కొడాలి స్థానంలో గుడివాడ వైసీపీ అభ్యర్థిగా అర్జునరావు పోటీ చేస్తారని వెల్లడించారు. గుడివాడలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలోనే పేర్ని నాని ఈ ప్రకటన చేయడం గమనార్హం. దీంతో 2029 ఎన్నికల తర్వాత ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కొడాలి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.
మాజీ మంత్రి కొడాలి నానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో ఆయన తర్వాత ఈ ఇద్దరిలో ఎవరు రాజకీయ ప్రవేశం చేస్తారనే ఉత్కంఠ ఇన్నాళ్లు కొనసాగింది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ పేర్ని నాని కీలక సమాచారం బయటపెట్టారు. మాజీ మంత్రి కొడాలికి వారసుడు ఆయన తమ్ముడు కొడుకు అర్జునరావు అంటూ వెల్లడించారు. దీంతో సమావేశంలో ఉన్న కార్యకర్తలు, ఇతర నేతలు అంతా చప్పట్లతో పేర్ని ప్రకటనను స్వాగతించారు. గుడివాడ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కొడాలి నాని గత ఎన్నికల్లో ఓటమి చెందారు. కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు బదులుగా తమ్ముడు కొడుకు అర్జునరావు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించినట్లు చెబుతున్నారు.
యువతలో ఫాలోయింగు, కొడాలి మాదిరిగానే దూకుడు ఉండటంతో ఆయనే 2034లో పార్టీ అభ్యర్థి అంటూ మాజీ మంత్రి పేర్ని ప్రకటించారు. దీంతో జిల్లా నుంచి యువనేతలు ఒక్కొక్కరుగా ప్రధాన రాజకీయ స్రవంతిలోకి వస్తున్నారని చెబుతున్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టూ ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కిట్టూనే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు గుడివాడకు కూడా కొత్త వారసుడిని పరిచయం చేయడం చూస్తే మాజీ మంత్రి పేర్ని వ్యూహాత్మకంగానే వ్యవహరించారని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు హోదాలో ఉన్న పేర్ని నాని గుడివాడ నియోజకవర్గంలో యువతను ఆకట్టుకోడానికి పార్టీ కేడర్ లో జోష్ నింపడానికి ఈ ప్రకటన చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. యువతకు అవకాశాలు ఇస్తామన్న సంకేతాలు పంపడానికే పేర్ని నాని 8 ఏళ్ల ముందుగానే 2034 ఎన్నికలపై ప్రకటన చేశారని విశ్లేషిస్తున్నారు.