జగన్ కి నేతలంతా దూరం...రీజన్ అదేనా ?
ఏపీలోనే కాదు దేశంలోనే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక్కసారి ఈసీ వద్ద ఉన్న పార్టీలు లిస్ట్ చూస్తే రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ పార్టీల జాబితా వేలలోనే ఉంటుంది.;
ఏపీలోనే కాదు దేశంలోనే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక్కసారి ఈసీ వద్ద ఉన్న పార్టీలు లిస్ట్ చూస్తే రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ పార్టీల జాబితా వేలలోనే ఉంటుంది. ఇక పుబ్బలో పుట్టి మఖలో మాడే పార్టీలు ఎన్నో ఉన్నాయి. రాజకీయం అన్నది అనాదిగా ఉంటూనే ఉంది. అది ఎప్పటికపుడు కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ వస్తోంది. దాంతో రాజకీయాలో నిబద్ధత అన్నది అతి పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్నిటిలోనూ ఫిరాయింపుల జాఢ్యం ఉంది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి జంప్ చేసిన వారు ఉన్నారు. వీటి మీద ఎన్ని చట్టాలు చేసినా అవి అలా నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ తక్కువలుగా అన్ని చోట్లా అదే సీన్ ఉంది.
వైసీపీలోనే ఎందుకలా :
వైసీపీలో అయితే ఇంకా ఎక్కువగా ఉంది ఆ పార్టీ వయసు దాదాపుగా పదిహేనేళ్ళు. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆ పార్టీలోకి ఎంతో మంది వచ్చారు వెళ్లారు, మొదటి ఉంచి ఉన్న వారు కూడా పార్టీని దాటేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఎందుకు ఇలా జరుగుతోంది అన్న దాని మీద అనేక రకాలైన రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. అయితే అదే పార్టీలో ఉంటూ ఎంతో కాలంగా పనిచేస్తూ వస్తున్న వారి అభిప్రాయం ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరమే. మాజీ మంత్రి పేర్ని నాని దీని మీద ఏం చెప్పారు అన్నది కూడా చూస్తే అవునా నిజమేనా అనిపిస్తుంది.
రాజకీయ అవకాశవాదమే :
రాజకీయాల్లో అవకాశవాదం అన్నది ముదిరిపోయింది అని పేర్ని నాని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. గతంలో కంటే ఇపుడు ఇది బాగా పెరిగిపోయింది అని అన్నారు నూటికి తొంబై అయిదు శాతం మంది రాజకీయ అవకాశవాదంతో ఉన్నారని ఆయన అంటున్నారు. దానికి కారణం అధికారం మీద యావ అని అన్నారు. తమకు భవిష్యత్తు ఉండాలని కోరుకునే వారు ఎపుడూ అధికారంలో ఉండాలని భావించే వారు పార్టీని వీడుతున్నారు అని అన్నారు. దానికి ఎవరిదీ తప్పు కాదని ఆయన అన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే రాజకీయాలే అలా తయారు అయ్యాయని అన్నారు.
అధికారం మత్తు :
అధికారం అన్నది ఒక మత్తు లాంటిది అని అది విశ్వవ్యాప్తంగా ఉందని ఆఖరికి క్రిమి కీటకాలలో సైతం ఈ యావ ఉందని పేర్ని నాని అంటున్నారు. ఒక్కసారి కనుక అధికారం రంగు రుచి వాసన మరిగిన వారు దానిని అంత సులువుగా వదులుకోవడానికి ఇష్టపడరని అన్నారు. అందుకే రాజకీయాల్లో ఈ కుప్పి గెంతులని పేర్ని నాని విశ్లేషించారు. పదవుల పిచ్చితోనే అంతా ఫిరాయిస్తున్నారు అని అంటున్నారు. ఆ యావ అంతకంతకు పెరిగిపోతోంది అని అంటున్నారు. కేవలం వైసీపీకి మాత్రమే ఈ ఫిరాయింపులు పరిమితం కాలేదని అన్ని పార్టీలలోనూ ఇదే రకమైన పరిస్థితి ఉందని నాని అన్నారు.
జగన్ ఆపలేకపోతున్నారా :
ఇక వైసీపీలో పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరుగుతూంటే జగన్ ఆపలేకపోతున్నారా అన్న దానికి ఆయన బదులిస్తూ జగన్ కాదు ఎవరైనా ఈ పరిస్థితుల్లో చేసేది ఏమి ఉంటుందని అన్నారు. ఎమోషనల్ కనెక్షన్లు భావోద్వేగాలను అన్నింటినీ అధిగమించి రాజకీయం సాగుతోంది అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరని విశ్లేషించారు. ఇక జగన్ సొంత కుటుంబ సభ్యులు సైతం ఆయనకు దూరం కావడం మీద అయితే నేరుగా పేర్ని నాని రియాక్ట్ కాలేదు కానీ మొత్తంగా అధికారం కోసం అంతా వైసీపీకి దూరం అవుతున్నారని ఒక సత్యం వినిపించారు. అంటే జగన్ ఏ మాత్రం కారణం కాదు అన్నదే ఆయన మాటగా ఉంది. మరి వైసీపీతో దశాబ్దన్నరగా ప్రయాణం చేస్తూ వచ్చిన వ్యక్తిగా నాని మాటలలో సత్యాలు ఎన్నో ఉన్నాయి. రాజకీయమే అలా ఉంది అన్నది నిజమే అని అంటున్న వారూ ఉన్నారు.