ఏపీలో 'మండలాల' మంటలు.. నేతలకు సెగ!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల.. రెండు కొత్త జిల్లాలు.. పోలవరం, మార్కాపురాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు మరో 5 కొత్త రెవెన్యూ మండలాలను కూడా ఏర్పాటు చేసింది.;
ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల.. రెండు కొత్త జిల్లాలు.. పోలవరం, మార్కాపురాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు మరో 5 కొత్త రెవెన్యూ మండలాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే.. కొన్ని కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న మండలాలను విభజించి.. తమ తమ గ్రామాలను కూడా మండలాలు చేయాలంటూ.. కొన్ని చోట్ల ప్రజలు డిమాండ్ చేశారు. అయితే.. సమయాభావం, ఆర్థిక సమస్యల కారణంగా.. ప్రభుత్వం కొన్ని కొన్ని మండలాల విభజనను పక్కన పెట్టింది.
ఈ క్రమంలో ఆయా మండలాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని -2 మండలంలోని 'పెద్దహరివాణం' గ్రామస్థులు తమ గ్రామాన్ని కూడా మండలంగా మార్చాలంటూ.. ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని మండలంగా మార్చే వరకు ఏ రాజకీయ పార్టి చెందిన నాయకులు గ్రామంలోకి అడుగు పెట్టరాదంటూ.. పెద్ద బోర్డును గ్రామ సరిహద్దుల్లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జిల్లాల ఏర్పాటు పై సర్కారు కసరత్తు ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడి గ్రామస్థలు ఉరిలే దీక్షలు చేస్తున్నారు.
తాజాగా ఏ రాజకీయ నాయకుడు మా గ్రామానికి రావద్దు అంటూ బోర్డు ఏర్పాటు చేసి తమ ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో అతిపెద్ద మండలమైన ఆదోనిని 4 మండలాలుగా విభజించాలని ఆదోని ఎమ్మెల్యే , టీడీపీ నేత పార్థసారథి కోరుతున్నారు. దీనిలో పెద్ద హరివాణం గ్రామం కూడా ఉంది. అయితే.. ఆదోని మండలాన్ని ప్రభుత్వం ఇటీవల 2 మండలాలుగా విభజించింది.
1) ఆదోని, 2) పెద్ద హరివాణం.. మండలాలుగా ప్రకటించింది. కానీ..పెద్ద హరివాణం మండలంలోని 16 గ్రామాల ప్రజలు .. తమకు ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలని.. ఇప్పటికే కలిపిన 22 గ్రామాలను దీని నుంచి విడదీయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద హరివాణాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వడం, కేంద్రం కూడా జిల్లాలు, మండలాల సరిహద్దులు మార్చేందుకు ఇచ్చిన గడువు(డిసెంబరు 30) ముగిసిపోవడంతో ఇది సాధ్యం కాకపోవచ్చని అధికారులు తెలిపారు.