ఎన్డీయేతో ఉన్నట్లా లేనట్లా...పవన్ స్టేట్మెంట్స్ వెనక...?
జనసేనాని పవన్ కళ్యాణ్ పెడన సభలో మాట్లాడిన దానికీ ముదినేపల్లి మీటింగ్ కి మధ్య జస్ట్ ఇరవై నాలుగు గంటల సమయమే గడచింది.;
జనసేనాని పవన్ కళ్యాణ్ పెడన సభలో మాట్లాడిన దానికీ ముదినేపల్లి మీటింగ్ కి మధ్య జస్ట్ ఇరవై నాలుగు గంటల సమయమే గడచింది. పెడన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మరీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ప్రకటించారు. జనసేన టీడీపీ ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అవుతుందని కూడా చెప్పారు. దాని మీద ఒక రోజు అంతా ఏపీవ్యాప్తంగా చర్చలు జరిగాయి.
ఎన్డీయేతో పవన్ కటీఫ్ అని పెద్ద ఎత్తున మీడియాలోనూ వార్తలు వచ్చాయి. తీరా ఇంత జరిగాక పవన్ కళ్యాణ్ ముదినేపల్లి మీటింగులో మాట్లాడుతూ ఎన్డీయేతో కటీఫ్ అని ఎవరు చెప్పారంటూ వైసీపీ మీద మండిపడ్డారు. తాను ఎన్డీయే నుంచి బయటకు వస్తే ఆ విషయాన్ని తానే స్వయంగా చెబుతాను తప్ప దొంగ దారిలో వ్యవహరించను తప్పుడు మాటలు మాట్లాడను అంటూ చెప్పుకొచ్చారు
ఈ రోజుకీ తాము ఎన్డీయేలోనే ఉన్నామని పవన్ సభా ముఖంగా స్పష్టం చేశారు. తనకు ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా అంటే అమితమైన గౌరవం ఉందని తెలిపారు. అందరం కలిసి వెళతామనే అనుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో వచ్చేది బీజేపీ టీడీపీ జనసేన ప్రభుత్వం అని పవన్ తొలిసారి ముదినేపల్లి మీటింగులో చెప్పారు. ఇప్పటిదాకా జనసేన టీడీపీ సర్కార్ అన్న పవన్ ఇపుడు బీజేపీని చేర్చారు. మరి ఈ ఇరవై నాలుగు గంటలలో ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ తాను ఎన్డీయే నుంచి బయటకు వచ్చానని అసలు అనలేదని పవన్ చెబుతున్నారు.
అంతే కాదు రేపటి ఎన్నికల్లో పొత్తుల మీద బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, చంద్రబాబు కలసి నిర్ణయిస్తారు అని మరో మాట కూడా మాట్లాడారు. ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కేంద్రం సాయం కూడా అవసరం అన్నారు. తామంతా కలిసే ప్రభుత్వాన్ని తెస్తామని అన్నారు.
ఇక తన మీద అభిమానులు పిచ్చి ప్రేమతో ఉన్నారని, కానీ తాను దేశం మీద పిచ్చి ప్రేమతో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. తాను దేశం భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచిస్తున్నానని పదవుల కోసం తన రాజకీయం ఉండదని అన్నారు. మొత్తానికి చూస్తే పవన్ స్టేట్మెంట్స్ రెండు రకాలుగా ఉండడంతోనే అయోమయం ఏర్పడింది అంటున్నారు. పవన్ స్టేట్మెంట్ ని చూసిన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక కమ్యూనిస్టులతో పొత్తుల గురించి మాట్లాడుతారు అని పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఇక కామ్రేడ్స్ అయితే ఏపీలో కొత్త పొత్తులు అంటూ ముందుకు వచ్చాయి. ఇలా రోజంతా ఏపీలో సాగిన హీట్ పాలిటిక్స్ కి పవన్ ముదినేపల్లి మీటింగ్ ద్వారా చెక్ పెట్టేశారు. 2014 పొత్తులే రిపీట్ అవుతాయని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన మాటలు వింటే కనుక కచ్చితంగా బీజేపీని పవన్ వదులుకోరనే స్పష్టం అయింది అంటున్నారు.
తనకు మోడీ అమిత్ షాలు అంటే గౌరవం అని పవన్ మరోసారి ప్రకటించారు. దేశానికి మోడీ నాయకత్వం అవసరం అన్నది పవన్ మాటలను బట్టి తెలుస్తోంది అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే పవన్ బీజేపీని వీడరని అలాగే బీజేపీ కూడా పవన్ని వీడదని అంటున్నారు. మరి టీడీపీతో బీజేపీ పొత్తులు కొలిక్కి వస్తే ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడుతుంది అంటున్నారు. ఆ దిశగా పవన్ తన వంతుగా ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు.