కూటమిలో నంబర్ టూగా పవన్.. ప్రభుత్వంలో కూడానా ?

జనసేన అధినేత కూటమిలో నంబర్ టూ గా అవతరించారా అంటే చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తోంది

Update: 2024-05-04 04:17 GMT

జనసేన అధినేత కూటమిలో నంబర్ టూ గా అవతరించారా అంటే చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తోంది. బాబు ప్రతీ విషయంలోనూ పవన్ ని రిఫరెన్స్ గా తెస్తున్నారు. ఆయనతో నేను అంటున్నారు. మేమిద్దరం మీ కోసం అని అంటున్నారు. మేము త్యాగాలు చేశామని అది ప్రజల కోసమని అంటున్నారు. పవన్ రియల్ హీరో అని కీర్తిస్తున్నారు.

ఇవన్నీ చూసినపుడు కచ్చితంగా ఎవరికైనా ఒక్కటే అనిపిస్తుంది కూటమిలో బాబు తరువాత పవనే అని. పవన్ తోనే ఎన్నికల ప్రచారాలూ ఎన్నికల మ్యానిఫేస్టో ఆవిష్కరణలు పవన్ తోనే కలసి రాజకీయ వ్యూహాల రూపకల్పనలు ఇవన్నీ చూస్తూంటే 2014 కంటే కూడా 2024లో పవన్ ప్రాధాన్యత టీడీపీలో పెరిగింది అని అంటున్నారు.

పవన్ కి ఇచ్చినవి 21 సీట్లు మాత్రమే. 144 సీట్లలో టీడీపీ పోటీ చేస్తోంది. ఇక 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తున్న బీజేపీ నుంచి కూటమి ప్రచారంలో ఎవరూ పాల్గొనడం లేదు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయిపోయారు. ఆమె తన గెలుపు కోసం కష్టపడుతున్నారు. ఇక బీజేపీకి చెందిన ఇతర కీలక నేతలు కూడా బాబు పవన్ లతో కలసి ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోవడం లేదు. దాంతో బాబు తరువాత పవన్ అన్నది రూడీ అవుతోంది.

అన్నీ అనుకూలించి రేపటి రోజున కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. అందులో రెండవ మాటకు తావే లేదు. మరి బాబు సీఎం అయితే పవన్ ఏమి అవుతారు అన్నదే జనసైనికులతో పాటు అందరినీ దొలిచేస్తున్న ప్రశ్న. చంద్రబాబు ఈ ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు పవన్ ని పట్టుకుని మునగ చెట్టు ఎక్కిస్తూ తెగ పొగుడుతున్నారు కానీ ఆయన తీరా గెలిచేశాక అదే విధంగా పవన్ తో మెలుగుతారా అంటే కచ్చితంగా చెప్పలేమనే అంటున్న వారు ఉన్నారు.

పవన్ కి న్యాయంగా చూస్తే హోం శాఖ వంటి కీలకమైన పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు కూటమిలో నంబర్ టూగా చూపిస్తున్న పవన్ ని రేపు ప్రభుత్వంలోనూ నంబర్ టూ చేయాలి. కానీ చంద్రబాబు నంబర్ టూ అంటేనే చికాకు పడతారు అన్నది ఆయన సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం చూస్తే అర్ధం అవుతుంది. ఆనాడు ఎన్టీఆర్ ని గద్దె దించే సమయంలో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఎనలేని ప్రాధాన్యతను బాబు ఇచ్చారు. తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు.

అన్నీ ఆయనకు చెప్పే చేసేవారు ఆయనతోనే మంతనాలు జరిపేవారు. దీంతో పొంగిపోయిన తోడల్లుడికి ఉప ముఖ్యమంత్రి ప్రామిస్ కూడా బాబు చేశారు. తీరా చూస్తే ప్రభుత్వంలో రెండవ అధికార కేంద్రం ఉండరాదని అది క్షేమకరం కాదని చెప్పి తోడల్లుడికి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు అని చెబుతారు. ఇపుడు చూస్తే పవన్ కళ్యాణ్ కి కూటమిలో ప్రాధాన్యత దక్కుతోంది అంటే అది ఎన్నికల సమయం కాబట్టి అంటున్నారు.

ఆయన వెనక బలమైన సామాజిక వర్గం ఉంది. అభిమానులు ఉన్నారు. దాంతో పవన్ ని వెంట తిప్పుకుంటున్నారని తీరా అధికారం చేతిలో పడగనే బాబు పవన్ ని ఉప ముఖ్యమంత్రిగా హో మంత్రిగా చేసి పక్కలో బల్లెం మాదిరిగా చేసుకుంటారా అన్న చర్చ అయితే సాగుతోంది. కాపు నేత మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య అయితే పవన్ ని నంబర్ టూ గా చేయమని అది ఎన్నికల సభలలోనే ప్రకటించమని ఒక లేఖ రాశారు. దానికి పవన్ బాబు ఇద్దరి నుంచి రెస్పాన్స్ లేదు.

పవన్ వరకూ అయితే ఆయన తొలి లక్ష్యం జగన్ గద్దె దిగి మాజీ సీఎం కావడం. అందువల్ల ఆయన ప్రస్తుతం వేరే వాటి మీద ఆలోచించడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన బేషరతుగానే కూటమికి మద్దతు ఇస్తున్నారు. ప్రజల కోసం తాము ఇద్దరము తగ్గామని బాబు చెబుతున్నారు కానీ అసలైన తగ్గడం పవన్ మాత్రమే చేశారు అన్నది రాజకీయం తెలిసిన వారికి అర్థమయ్యే విషయం.

మరి పవన్ ఇంతటి త్యాగానికి విలువ ఆయన కోరుతారా లేక జగన్ దిగిపోయారు ఏపీ ప్రజలకు న్యాయం జరిగింది అని జస్ట్ ఎమ్మెల్యేగా ఉండి తన సినిమాలు తాను చేసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ప్రభుత్వం లో కనుక పవన్ ఉప ముఖ్యమంత్రిగా కీలక హోం మంత్రిగా ఉంటే మాత్రం పవన్ దే పై చేయి అయినట్లుగా అంతటా కనిపిస్తుంది.

అది టీడీపీ భావి వారసుడు లోకేష్ సైతం సైడ్ అయిపోయేటంతగా పవన్ అధికార కళ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అని అంటున్నారు. మరి దానిని కూడా తట్టుకుని పవన్ కి కిరీటం తొడిగి పక్క కుర్చీ వేస్తారా అన్నది పెద్ద ప్రశ్న. చంద్రబాబుకు అయితే ప్రస్తుతానికి పవన్ మీద నిజాయతీగా ప్రేమాభిమానాలు ఉన్నాయని భావించాలి. మరి ఆ అభిమానంతో పవన్ ని ప్రభుత్వంలోనూ తన పక్కన పెట్టుకుంటే మాత్రం మొత్తం చంద్రబాబు రాజకీయ చరిత్రలో సరికొత్త బాబునే అంతా చూస్తారు అన్నది నిజం.

Tags:    

Similar News