ఎంపీగా పవన్ పోటీ... కూటమికి షాక్...!?
అయితే పవన్ ఎంపీగా పోటీ చేయడం మంచిదా కాదా అన్న చర్చ అపుడే మొదలైంది.;
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా టీడీపీ కూటమి తరఫున పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. బీజేపీ పెద్దల సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. అయితే పవన్ ఎంపీగా పోటీ చేయడం మంచిదా కాదా అన్న చర్చ అపుడే మొదలైంది.
కూటమి తరఫున పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే సీట్ల బదిలీ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదని, అలా కాకుండా ఆయన ఎంపీగా పోటీ చేస్తే మాత్రం జనసేన క్యాడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. పవన్ ఢిల్లీ రాజకీయాలకు వెళ్తారు అన్నది కనుక జనసైనికులలో అలోచనగా ఉంటే అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు.
పవన్ నాకు సీఎం పదవి కావాలని ఒకసారి వద్దు అని మరోసారి, మనకు సీఎం పదవి కావాలంటే బలం ఉండాలని మరోసారి అంటూ వచ్చారు. కానీ జనసైనికులు మాత్రం పవన్ తమ సీఎం అని ఎపుడో డిసైడ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ 2014 మార్చిలో పార్టీ పెట్టారు. అప్పటి నుంచి వారు పవన్ ని సీఎం అనే అంటున్నారు.
పవన్ సీఎం ఎలా అవుతారు అన్నది వారికి అనవసరం, రాజకీయ గణిత శాస్త్రాలు లెక్కలు వారికి పట్టవు. మా పవన్ సీఎం కావాల్సిందే అని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ రోజుకీ జనసైనికులలో పవన్ సీఎం అవుతారు అన్న భావన గట్టిగా ఉంది జనసేన పొత్తులో భాగంగా 24 సీట్లను మాత్రమే తీసుకుంది.
అయితే ఈ సీట్లను తాము మొత్తం గెలుచుకుంటామని అపుడు పవన్ కి సీఎం చాన్స్ వస్తుందని ఆ పార్టీ క్యాడర్ అంటోంది. మరి ఇంతలా పవన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుచరులు అభిమానులు అనుకుంటున్న వేళ పవన్ ఎంపీగా పోటీ అంటే కచ్చితంగా ఆయన ఏపీకి దూరం అవుతారు అని వారు భావిస్తారు. అపుడు ఏ ఆశలు ఊహలు పెట్టుకోవడానికి కనీస మాత్రంగా కూడా అవకాశం లేకుండా పోతుంది.
పవన్ సీఎం కాకపోతే మనకెందుకు అని సైనికులు నిరుత్సాహ పడినా బలమైన సామాజిక వర్గంలో వేరే ఆలోచనలు వచ్చినా అది అంతిమంగా టీడీపీ కూటమికే చేటు తెస్తుందని అంటున్నారు. పవన్ చంద్రబాబు ఇద్దరూ కలసి వేదికల మీద ప్రసంగాలు చేస్తున్నారు. ఏ సభ అయినా ఇద్దరూ ఉంటున్నారు.
అదే విధంగా చూస్తే కనుక టీడీపీ జనసేన ప్రభుత్వం అని చెబుతున్నారు. ఇపుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే కనుక కచ్చితంగా అది కూటమికే షాక్ ఇచ్చేలా మారుతుందని అంటున్నారు. అయితే పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అలాగే కాకినాడ నుంచి ఎంపీగా రెండు చోట్లా పోటీ అంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
కానీ ఒకే చోట పోటీ చేసి అది కూడా ఎమ్మెల్యేగా చేస్తేనే పవన్ పట్ల జనసైనికుల విశ్వాసం ఉంటునని, అదే కూటమికి శ్రీరామ రక్షగా ఉంటుందని అంటున్నారు. అసలు ఎంపీగా పోటీ అన్నది పూర్తిగా పక్కన పెట్టాలని అంటున్నారు. పవన్ రాజకీయాన్ని రాష్ట్రంలోనే చేయాలి తప్ప ఢిల్లీకి వెళ్లరాదు అన్నది జనసైనికుల మనోగతంగా ఉంది అని అంటున్నారు.
ఏది ఏమైనా ఎమ్మెల్యే ఎంపీ అంటే గెలిచిన తరువాత రెండింటిలో ఏదో ఒకటి రాజీనామా చేస్తారు కాబట్టి రెండింటి మీద మనసు పెట్టి ఓట్లు వేయించే పరిస్థితులు ఉంటాయా అన్నది మరో చర్చ. అదే విధంగా చూస్తే కనుక ఒక రకమైన గందరగోళం కూడా ఏర్పడుతుందని అంటున్నారు.
గతంలో అంటే 2019లో ఇదే జరిగింది అని గుర్తు చేస్తున్నారు. పవన్ గాజువాక భీమవరంలో పోటీ చేశారు. దాంతో అక్కడ గెలిచి ఇక్కడ పవన్ రాజీనామా చేస్తారు అని ప్రత్యర్ధులు చేసిన ప్రచారంతో గెలిపించి రాజీనామా చేయించడం మళ్లీ ఉప ఎన్నికలు ఇవన్నీ ఎందుకు అని ఎవరికి వారు అనుకోవడంతో రెండు చోట్లా పవన్ ఓడారు అని అంటున్నారు. ఇప్పటికైనా పవన్ ఒకే సీటు అది ఎమ్మెల్యే సీటు నుంచి పోటీ చేస్తేనే బాగుంటుందని అంటున్నారు. మరి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాల్సి ఉంది.