కొడాలి వల్లభనేని ఏం చేయబోతున్నారు ?

కొడాలి నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్, నాలుగు సార్లు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరసగా గెలిచారు.;

Update: 2026-02-17 03:30 GMT

కొడాలి నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్, నాలుగు సార్లు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరసగా గెలిచారు. అందులో రెండు సార్లు టీడీపీ నుంచి గెలిస్తే మరో రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు. 2024లో కూడా గెలిచి తన రాజకీయ రిటైర్మెంట్ ని 2029లో ప్రకటించాలని భావించారని ప్రచారం అప్పట్లో సాగింది. కానీ ఆయన తొలిసారి ఓటమి పాలు అయ్యారు. టీడీపీ నుంచి ఎన్నారై నేతగా వచ్చిన రాము ఆయన్ని ఓడించి ఎమ్మెల్యే అయిపోయారు ప్రస్తుతం ఆయన జోరు బాగా చూపిస్తున్నారు గత ఇరవై నెలలలో కొడాలి నాని అయితే పెద్దగా తన నియోజకవర్గానికి వెళ్ళింది లేదు అని అంటున్నారు.

వంశీ గానం ఎక్కడ :

ఇక మరో కీలక నియోజకవర్గం గన్నవరం. ఇక్కడ నుంచి 2014, 2019లలో వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ. ఆయన జగన్ వేవ్ లో సైతం గెలవడం గొప్ప విషయం. అయితే గెలిచిన తరువాత ఆయన టీడీపీ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. దాంతో పాటుగా ఆయన సైతం టీడీపీ అధినాయకత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. దాంతో ఆయనను టీడీపీ గట్టిగానే టార్గెట్ చేసింది. 2024 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు అయ్యారు. ఇక వంశీ టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో జైలు జీవితం కూడా అనుభవించారు. ఆ మీదట ఆయన ఫుల్ సైలెన్స్ అయ్యారు.

టీడీపీ దూకుడుతో :

ఈ రెండు నియోజకవర్గాలకు ఇంచార్జులుగా కొడాలి నాని వంశీలను జగన్ నియమించారు. అయితే ఈ ఇద్దరు కీలక నేతలు పెద్దగా అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. దాంతో వైసీపీ అయితే గత ఇరవై నెలల కాలంలో పుంజుకోవడం లేదని కూడా చెబుతున్నారు. మరో మూడేళ్ళలో ఎన్నికలు ఉన్న వేళ ఇప్పటి నుంచి జనంలో ఉండాల్సిన అవసరం ఉందని వైసీపీలో చర్చ సాగుతోంది. అయితే ఎందుకో ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్స్ డల్ అయ్యారని చెబుతున్నారు. ఇంకో వైపు చూస్తే టీడీపీ ఎమంల్యేలు అయితే ఈ రెండు చోట్లా దూకుడుగా ఉన్నారు. మరోసారి గెలిచేందుకు అన్ని రకాలైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

ఓడించాల్సిందే :

ఇక టీడీపీ అధినాయకత్వం కూడా అదే పట్టుదల మీద ఉంది. తాజాగా టీడీపీ అధినయాకత్వం మచిలీపట్నం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద నిర్వహించిన రివ్యూ మీటింగులో గన్నవరం గుడివాడల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అని అంటున్నారు. ఈ రెండు చోట్ల ఎమ్మెల్యేల పనితీరు బాగానే ఉంది అని అధినాయకత్వం చెబుతూనే మరింతగా జోరు పెంచాలని సూచించినట్లుగా తెలుస్తోంది. 2029 నాటికి మళ్ళీ కొడాలి నాని వల్లభనేని వంశీ తన సీట్ల నుంచి పోటీ చేస్తారని టీడీపీ ఊహిస్తోంది. వారు తిరిగి పోటీ చేసినా మరోసారి మాజీలను చేయాల్సిందే అన్నది టీడీపీ పెద్దల గట్టి పట్టుదలగా ఉంది అని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేల తమ్ముళ్ళను ఒకటికి పదిసార్లు గట్టిగా నియోజకవర్గంలో చుట్టేయాలని పట్టు మరింతగా బిగించేయాలని కోరింది అని అంటున్నారు. మరి కొడాలి కానీ వంశీ కానీ ఏమి నిర్ణయించుకుంటున్నారు, వారు రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి తమ నియోజకవర్గాలలో సత్తా చాటి ఎమ్మెల్యేలుగా విజయంతో ముందుకు సాగుతారా అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News