పవన్ వర్సెస్ లోకేశ్.. వైసీపీ కోరుకున్నది ఇదే కదా?
కూటమి మరో 15 ఏళ్లు కొనసాగుతుందని పవన్ పదేపదే చెబుతున్నారు. అదే సమయంలో తన తోడ పుట్టకపోయినా అన్నగా భావిస్తున్నానని పవన్ తో అనుబంధం కొనసాగించేందుకు లోకేశ్ ప్రాధాన్యం ఇస్తున్నారు.;
ఏపీ పాలిటిక్స్ లో స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు మంత్రులు మధ్య పోటీ నెలకొందా? ఆ ఇద్దరి మధ్య చిచ్చు రావాలని, పొత్తు పెటాకులు అవ్వాలని ప్రత్యర్థి పార్టీ వైసీపీ కోరుకుంటున్నట్లే జరుగుతుందా? అనే చర్చ జరుగుతోంది. కూటమిలో కీలకంగా పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత, ఐటీ మంత్రి లోకేశ్ మధ్య జరుగుతున్న పోటీ ఆసక్తిరేపుతోంది. అయితే ఈ ఇద్దరి మధ్య ప్రత్యర్థి పార్టీ వైసీపీ కోరుకుంటున్న తరహా మాత్రం కనిపించడం లేదని, రాజకీయాల్లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధమైన పోటీ జరుగుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి నారా లోకేశ్ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటికి లోకేశ్ తో పోల్చితే పవన్ కు పాలనపై ఎటువంటి అవగాహన లేదు. లోకేశ్ గతంలో ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా పాలనపై కొంతమేర అవగాహనతో కూటమి ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో పవన్ పదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించారే కానీ అధికారం కొత్త. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో మిగిలిన మంత్రులు కన్నా, మెరుగైన విధంగా పవన్ పనిచేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కూటమిలో పూర్తి స్వేచ్ఛ లభించింది. ముఖ్యమంత్రి కుమారుడిగా లోకేశ్ కూడా పూర్తి అధికారాలు చలాయిస్తున్నారు. సహజంగా ఎక్కడైనా ఇలా రెండు అధికార కేంద్రాలు ఉంటే ఆటోమెటిక్ గా విభేదాలు పొడసూపుతాయి. ఈ కారణంగానే వైసీపీ కూడా ఆ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రావగా, మంట మరింత రాజేసి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం దక్కకపోతుందా? అని ఎదురుచూస్తుంది. కానీ, పవన్, లోకేశ్ మాత్రం ఆ అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
కూటమి మరో 15 ఏళ్లు కొనసాగుతుందని పవన్ పదేపదే చెబుతున్నారు. అదే సమయంలో తన తోడ పుట్టకపోయినా అన్నగా భావిస్తున్నానని పవన్ తో అనుబంధం కొనసాగించేందుకు లోకేశ్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య చిచ్చు రేగేలా జరుగుతున్న ప్రచారాన్ని తాము నమ్మే పరిస్థితుల్లో లేమని తేల్చిచెబుతున్నారు. కేడర్ ను కూడా ఆ దిశగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇద్దరు నేతలు ఈ విషయంలో చక్కటి సమన్వయంతో నడుచుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
మరోవైపు అధికార బాధ్యతలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో కూడా ఇద్దరూ పరస్పరం పోటీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకరు అధికారులతో సమన్వయం చేసుకుంటే, మరొకరు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళుతున్నారు. ఒకరు క్షేత్రస్థాయిలో ఉంటే మరొకరు సచివాలయంలో సమీక్షలతో ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. మీడియా కవరేజ్ విషయంలో కూడా ఈ ఇద్దరి మధ్య క్రాస్ ఫైర్ జరగకుండా కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పవన్ కృష్ణా జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళితే ఆ సమయంలో లోకేశ్ రాజధాని అమరావతిలో తుఫాను బాధితుల సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడం చూస్తే ఈ ఇద్దరి మధ్య పరస్పర సమాచారం, సమన్వయం చక్కగా ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.
అదేవిధంగా పవన్ తిరుపతి వెళితే, అదే సమయంలో లోకేశ్ అనంతపురంలో పర్యటించడాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు పవన్ మాస్ ఇమేజ్ కూడగట్టే కార్యక్రమాలకు వెళుతుంటే, లోకేశ్ పెట్టుబడులు, పారిశ్రామిక వేత్తలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రగతికి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. పవన్ గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి మద్దతు కూడ గట్టే ప్రయత్నం చేస్తుంటే, పవన్ పట్టణ ప్రాంతాల్లో పర్యటించి యువతలో సానుకూలత పెంచుకునేలా పనిచేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఇద్దరు మంత్రులు వ్యవహార శైలి కూటమికి కొత్త ఊత్సాహం ఇస్తుండగా, వైసీపీ ఉసూరుమనిపిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.