పార్టీ రాజకీయాల్లో కార్మిక సంఘాలు.. విశాఖ స్టీల్ లేబర్ పాలిటిక్స్ పై పవన్ ఫైర్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రుల పరామర్శ అనంతరం స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు డిప్యూటీ సీఎం. ప్రమాదకారణాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్లాంట్ లో ప్రస్తుత పరిస్థితులు, కార్మిక సంఘాల వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్మిక సంఘాలు తమ బాధ్యతను వదిలేసి రాజకీయాలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయని మండిపడ్డారు. తాను గతంలో ప్రతిపక్షంలో ఉండగా, కార్మిక సంఘాలతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చినా, వారు సరిగా స్పందించలేదని, అందుకే ఈ విషయంపై గట్టిగా మాట్లాడుతున్నానంటూ పవన్ వ్యాఖ్యానించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను గత వైసీపీ ప్రభుత్వం అమ్మేస్తామంటే తాము కొట్లాడి అడ్డుకున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రి అమిత్ షాకి విశాఖ స్టీల్ ప్లాంట్ పై నివేదిక ఇచ్చామని, తామంతా సమస్టిగా కృషి చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని వెల్లడించారు. ఇక ప్రమాదం జరిగిన ఇలాంటి సమయంలో క్యాప్టివ్ మైన్స్ కోసం కొందరు అడుగుతున్నారని, అటువంటివి అడిగే సమయం ఇది కాదన్నారు. ఇదే సమయంలో కార్మిక సంఘాలను ఉద్దేశించి పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వారినే అడగాలి అన్నట్లు కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విమర్శించారు. ఐదేళ్లు పాలించిన వారిని ఒక్క మాట కూడా అడగలేదన్నారు. వైసీపీ ఐదేళ్లు, అంతకుముందు కాంగ్రెస్ పదేళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్ కు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయని వివరించారు. ఆ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. తాను సమస్యల నుంచి పారిపోయే వ్యక్తిని కానని, స్టీల్ ప్లాంట్ పై చర్చించేందుకు త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.
స్టీల్ ప్లాంట్ పై తనకు పూర్తిగా అవగాహన ఉందని పవన్ తెలిపారు. యాజమాన్యం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని జరుగుతున్న ప్రచారంపైనా పవన్ స్పందించారు. ఇలాంటి విషయాలను ముందుగా కార్మిక సంఘాలు వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. కార్మికులతో మాట్లాడిన తర్వాత ప్రమాదానికి కారణాలు ఏంటో తెలుస్తాయన్నారు. సంఘాలు కార్మిక సంక్షేమాన్ని అటకెక్కించి పార్టీ రాజకీయాల్లో మునిగిపోయాయని పవన్ ఆక్షేపించారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఒక్కో ప్రభుత్వంలో ఒక్కోలా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఏ ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం పోయిందనే ఆలోచనతో ఉంటున్న కార్మిక నాయకులు వైసీపీ వస్తే కాంప్రమైజ్ అయిపోతున్నారని ధ్వజమెత్తారు. కార్మిక సమస్యల పరిష్కారంపై మాట్లాడతానని గతంలో తాను అడిగితే ఎవరూ సహకరించలేదని ఎత్తిచూపారు. యూనియన్లు వారి పనులు సక్రమంగా చేయాలని హితవు పలికారు.