స్కూల్లో అగ్ని ప్రమాదం: చిక్కుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉండగా ఈ విషయం ఆయనకు తెలిసింది.;

Update: 2025-04-08 04:36 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్‌ శంకర్‌ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు సమాచారం. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉండగా ఈ విషయం ఆయనకు తెలిసింది. దీంతో ఆయన వెంటనే తన పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్‌కు బయలుదేరారని అధికారులు, పార్టీ నాయకులు సూచించారు. అయితే, పవన్‌ కల్యాణ్ మాత్రం తన పర్యటనను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని సందర్శిస్తానని అక్కడి గిరిజనులకు మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటానని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని, వాటిని పూర్తి చేసిన తర్వాతే సింగపూర్‌కు వెళ్తానని ఆయన తెలిపారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన వెంటనే పవన్‌ కల్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుమారుడికి గాయాలైన విషయం తెలిసినప్పటికీ తన బాధ్యతలను విస్మరించకుండా పర్యటనను కొనసాగించాలని నిర్ణయించుకున్న పవన్‌ కల్యాణ్ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

కాగా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. ఆయన ఎలా ఉన్నారన్న సమాచారం త్వరలోనే తెలుస్తుంది.

Tags:    

Similar News