"రెచ్చగొట్టొద్దు బాస్.. తట్టుకోలేరు బాస్.." ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ.. జనసేన సీరియస్ రియాక్షన్
ఇక మరో నాయకుడు సంపత్ నాయక్ మాట్లాడుతూ నిన్న సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, బక్క జడ్సన్ వంటివారు అన్న మాటలను తీవ్రంగా తప్పుబట్టారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ క్రాంతి దళ్ నేతలు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ జనసేన నేతలు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణకు చెందిన మేథావులు, జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఉప ముఖ్యమంత్రి పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. జనసేన నేతలు సాగర్, సంపత్ నాయక్ ఆధ్వర్యంలో జనసేన తెలంగాణ ప్రతినిధులు గురువారం మీడియాతో సమావేశం నిర్వహించారు. నిన్న తెలంగాణ క్రాంతిదళ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఆయనను అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు పరుష పదజాలం వాడారంటూ జనసేన నేతలు మండిపడ్డారు.
తెలంగాణలో పవన్ కల్యాణ్ ను అడుగు పెట్టనీయమని క్రాంతి దళ్ నేతలు చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. పవన్ ను హైదరాబాద్ లో అడుగు పెట్టనీయకుండా అడ్డుకునే దమ్ము ఎవరికైనా ఉందా? అంటూ పార్టీ నేత సాగర్ సవాల్ విసిరారు. మేథావులుగా చెప్పుకునే వారు రాజ్యాంగ హక్కులను అడ్డుకుంటామని అనడం ఏంటని ప్రశ్నించారు. తమను రెచ్చగొట్టొద్దని, తట్టుకోలేరని ఈ సందర్భంగా సాగర్ హెచ్చరించారు. తమకు సహనం ఉందని, ఇక్కడితో ముగిద్దామని హితవు పలికారు.
ఇక మరో నాయకుడు సంపత్ నాయక్ మాట్లాడుతూ నిన్న సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, బక్క జడ్సన్ వంటివారు అన్న మాటలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతూ, కొంతమంది చిల్లర గాళ్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడమేంటి అంటూ ఫైర్ అయ్యారు. క్రాంతి దళ్ అధ్యక్షుడు ఫృద్విరాజ్ వ్యాఖ్యలు ఆక్షేపణీయంగా ఉన్నాయన్నారు. కాటికి కాలుచాపిన వయసులో పాశం యాదగిరి పద్ధతిగా మాట్లాడాలని హితవు పలికారు. నువ్వుంటే నాకు గౌరవం ఉందని చెబుతూనే బుద్ధి ఉంది రా? నీకు అంటూ సంపత్ నాయక్ మండిపడ్డారు. పవన్ ఐదు పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు బాధ అంటూ సంపత్ నాయక్ ప్రశ్నించారు. కాగా, జనసేన నేతల మీడియా సమావేశంలో కొందరు మీడియా ప్రతినిధులతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. జనసేన నాయకుడు సాగర్ కల్పించుకుని జర్నలిస్టులను సర్దిచెప్పడంతో వివాదం సర్దుమణిగింది.