మోడీ బొమ్మ పక్కన పవన్ బొమ్మ ఉండకూడదా ?

దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మోడీ ఫోటో పక్కన పవన్ బొమ్మ ఉండకూడదా అంటే కూడదంటే కూడదని వైసీపీ వాదిస్తోంది.;

Update: 2025-06-22 04:01 GMT

దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మోడీ ఫోటో పక్కన పవన్ బొమ్మ ఉండకూడదా అంటే కూడదంటే కూడదని వైసీపీ వాదిస్తోంది. పైపెచ్చు పవన్ కి రాజ్యాంగబద్ధంగా చూస్తే ఉప ముఖ్యమంత్రి అన్నది అధికారిక హోదా కాదని కేవలం మంత్రిగానే ఆయన ఉన్నారని చెబుతోంది.

దీని కోసం సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు కానీ ఇతర అధికారిక సమాచారంలో కానీ ప్రధాని పక్కన ముఖ్యమంత్రి ఫోటో తప్పించి మరొకరిది ఉండరాదని రూల్స్ చెబుతోంది. ఈ మేరకు వైసీపీ తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో చూస్తే కనుక ప్రధాని ఫోటోతో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండడం వరకూ ఓకే కానీ పవన్ నారా లోకేష్ ల ఫోటోలు ఏ హోదాలో పెడతారు అని పాయింట్ ఆఫ్ ఆర్డర్ ని లేవదీస్తోంది.

ఈ మేరకు నిర్దిష్టంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని కావాలంటే చూసుకోండని అంటోంది. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్ర‌కారం ప్ర‌భుత్వ‌ ప్ర‌క‌ట‌న‌ల్లో ప్ర‌ధాన మంత్రి ఫోటో ఉన్న‌ప్పుడు ప‌క్క‌న ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫోటో మాత్ర‌మే వాడాలి. మ‌రే ఇత‌ర మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం ఫోటో కానీ వాడరాదు అని చెబుతోంది. ఇక్కడ వైసీపీ మెన్షన్ చేసిన విషయం ఏంటి అంటే డిప్యూటీ సీఎం ప‌ద‌వికి ఎలాంటి రాజ్యాంగ బ‌ద్ద హోదా లేదని అందుచేత ఇలా పవన్ బొమ్మ వాడ‌డం రూల్స్ కు విరుద్ధం అని స్పష్టం చేస్తోంది.

ఇక విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఏపీలోని వివిధ ప‌త్రిక‌లలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా ఇచ్చిన అపూర్వ యోగా సంగ‌మం ప్ర‌క‌ట‌న‌లను వైసీపీ గుర్తు చేసిది. అందులో ప్ర‌ధాన మంత్రి, ముఖ్య‌మంత్రి ఫోటోల‌తో పాటు కేవ‌లం డిప్యూటీ సీఎం గా పవన్ అలాగే మంత్రిగా ఉన్న్న లోకేష్ ఫోటోలు మాత్ర‌మే వాడారు. ఇలా వాడ‌డం అన్న‌ది రూల్స్ కు విరుద్ధంమని వైసీపీ వాదిస్తోంది. అంతేకాదు మిగ‌తా మంత్రుల‌ను అవ‌మానించ‌డం కూడా అని అంటోంది.

ఇక్కడ చెప్పాలీ అంటే ఇది కొత్త కాదు కూటమి అధికారంలోకి వచ్చాక ప్రధాని ఫోటో పక్కన ఫోటోలలో పవన్ లోకేష్ ల ఫోటోలను పెడుతోంది. అంతే కాదు ప్రతీ ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు ఫోటోతో పాటు పవన్ ఫోటోలు పెడుతోంది.

న్యాయంగా అయినా ప్రోటోకాల్ ప్రకారం చూసినా ప్రభుత్వ ఆఫీసులలో రాష్ట్రపతి ప్రధాని ముఖ్యమంత్రి ఫోటోలు మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. మరి ఏడాది పాటుగా ఇవన్నీ చూసి కూడా వదిలేసిన వైసీపీ ఇపుడే ఈ విధంగా పాయింట్ లేవనెత్తడమేంటి అన్న చర్చ సాగుతోంది.

పైగా పవన్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఇదంతా ఉందని అంటున్నారు. మరి సుప్రీం కోర్టు రూల్స్ కి విరుద్ధమని అంటున్న వైసీపీ దానిని కోర్టు దృష్టికి తీసుకుని రావచ్చు కదా అని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ కూటమి కట్టి మరీ వైసీపీని అధికారంలో నుంచి దించేందుకు పూర్తి స్థాయిలో దోహదపడ్డారు అన్న ఆలోచనలతోనే ఇదంతా వైసీపీ చేస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ రోజులలో ఉప ముఖ్యమంత్రి పదవులు రాజ్యంగ బద్ధంగా కాకపోయినా రాజకీయంగా పవర్ ఫుల్ అన్నది వైసీపీ నేతలకు తెలిసే ఈ విధంగా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతున్నారా అన్నదే అసలైన ప్రశ్నగా ఉంది.

Tags:    

Similar News