ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినా కొన్ని విషయాలు అంగీకరించడం లేదు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

గురువారం రాజధాని అమరావతిలోని సీకే కన్వెన్షన్ హాల్లో పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు.;

Update: 2025-04-24 08:31 GMT

పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏరికోరి ఎంపిక చేసుకున్న పంచాయతీరాజ్ శాఖలో ఎంతో మార్పు తీసుకువచ్చానని చెప్పారు. పల్లె ప్రజలకు సేవ చేసే తన శాఖలో సమర్థులు, ప్రతిభావంతులే ఉద్యోగులుగా ఉండాలని భావిస్తున్నానని, ఈ విషయంలో తనకు ఎవరు చెప్పినా సమర్థులైతేనే ప్రోత్సహిస్తానని తెగేసి చెబుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు.

గురువారం రాజధాని అమరావతిలోని సీకే కన్వెన్షన్ హాల్లో పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామాలు స్వయంప్రతిపత్తితో ఎదగాలని ఆకాంక్షించారు. పంచాయతీలకు కేటాయించిన నిధులను వాటి అభివృద్ధికే కేటాయించాలని స్పష్టం చేశారు. అందుకే తన శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల్లో సమర్థులు, ప్రతిభావంతులను మాత్రమే ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

‘‘గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నా కండీషన్లు ప్రకారం పనిచేయాలి. సమర్థులకు గుర్తింపునిస్తున్నా.. రూల్ బుక్ అతిక్రమించి ఏ పనీ చేయను. ఇలాంటి నిబద్ధతే నన్ను సమర్థంగా పనిచేయిస్తోంది. అందుకే ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నాను. పంచాయతీరాజ్ శాఖలో పోస్టింగుల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మందిని సిఫార్సు చేస్తున్నారు. కానీ సమర్థులు, ప్రతిభావంతులైతేనే తీసుకుంటానని చెప్పేస్తున్నాను’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్.

ఈ పది నెలల్లో నేను కొన్ని చేశానని, ఇంకా చాలా చేయాల్సివుందన్నారు. గత ఐదేళ్ల పాలనతో పోల్చి చూస్తే ఈ పది నెలల్లో పంచాయతీరాజ్ శాఖ ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. నాకు పరిపాలనా అనుభవం లేకపోయినా మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉందన్నారు. అట్టడుగు శ్రామికుడి వరకు ఫలితాలు పొందాలంటే చిన్న పైరవీలు కూడా జరగకూడదని అభిప్రాయపడ్డారు. నా ఈ నిర్ణయాన్ని మా పేషీలో అందరూ బలంగా తీసుకెళ్లారని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News