కూటమిలో 'పవన్' రచ్చ బండ.. రగిలిపోతున్న టీడీపీ!
ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. 'అడవితల్లిబాట 2.0' కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. 'అడవితల్లిబాట 2.0' కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2023లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో జనసేన శ్రేణులే ముందుండి పోరాడాయని, ఆ సమయంలో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కడానికి భయపడ్డాయనే అర్థం వచ్చేలా పవన్ మాట్లాడటంపై టీడీపీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యల సారాంశం ఏమిటి?
2023 సెప్టెంబరులో చంద్రబాబు అరెస్ట్ సమయంలో తమ పార్టీ శ్రేణులు, వీర మహిళలు ఎలాంటి భయం లేకుండా ముందుగా రోడ్డుపైకి వచ్చి తీవ్ర నిరసనలు తెలిపారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. తన పార్టీ శ్రేణుల కష్టాన్ని, తెగువను మెచ్చుకునే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఇది పొరుగు పార్టీ అయిన టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసిందని అంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిద్రాహారాలు లేని పోరాటం
చంద్రబాబు అరెస్ట్ అయిన సెప్టెంబరు 9 నుంచి ఆయన విడుదల అయ్యే వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిద్రాహారాలు మాని రోడ్లపైనే ఆందోళనలు చేశారని గుర్తుచేస్తున్నారు. నంద్యాల నుంచి రాజమండ్రి వరకు చంద్రబాబును తరలించే దారి పొడవునా టీడీపీ శ్రేణులు అడ్డుకుని నిరసన తెలిపిన చారిత్రక నిజాన్ని ఎవరూ మరచిపోలేరని అంటున్నారు. ఆ సమయంలో జనసేనతో అధికారిక పొత్తు ఇంకా ప్రకటించబడలేదని (సెప్టెంబరు 14న పొత్తు ప్రకటన వచ్చింది), తొలినాళ్లలో తమకు జనసేన నుంచి కనీస సంఘీభావం కూడా దక్కలేదని టీడీపీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి.
పవన్ చొరవ అభినందనీయమే కానీ..
ఆపద సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రికి వచ్చేందుకు ప్రయత్నించి, పోలీసుల అడ్డుగింపుతో రోడ్డుపై బైఠాయించిన పవన్ పోరాటం అభినందనీయమే అయినప్పటికీ... "తమ పార్టీ శ్రేణులు భయపడ్డాయన్నట్లు" మాట్లాడటాన్ని మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ తరహా వ్యాఖ్యల వల్ల కూటమి సుదీర్ఘకాలం కలిసి ప్రయాణించాలనే లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు కూటమిలోని ప్రధాన పక్షమైన టీడీపీ శ్రేణుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే 'కూటమి గెలుపునకు తానొక్కడినే కారణం' అనే ప్రచారంపై చర్చ నడుస్తుండగా, ఇప్పుడు తాజా వ్యాఖ్యలతో పుండుపై కారం చల్లినట్లుగా మారాయని చెబుతున్నారు. మున్ముందు రాబోయే స్థానిక ఎన్నికలపై ఈ పరిణామాలు ఓట్ల బదిలీ పరంగా ఎలాంటి ప్రభావం చూపుతాయోనని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఈ వివాదంపై కూటమి పెద్దలు ఏ విధంగా స్పందించి సద్దుమణిగిస్తారో వేచి చూడాలి!