ఆరుగురు కొత్త గవర్నర్లు...ఏపీకి చాన్స్ లేదా ?

దేశంలో ఆరు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2026-10-13 01:03 GMT

దేశంలో ఆరు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా బీజేపీకి చెందిన పూర్వ నాయకులు కావడం విశేషం. మిత్ర పక్షాలకు ఈసారి గవర్నర్ల కోటాలో చాన్స్ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ అది ఎక్కడా కనిపించలేదు. ఇక కొత్త గవర్నర్ల జాబితా చూస్తే కేరళ నూతన గవర్నర్‌గా ఓం ప్రకాశ్ మాథుర్ నియమిత్రులు అయ్యారు. తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. కర్ణాటక కొత్త గవర్నర్ గా డాక్టర్ సుధా యాదవ్‌, ఒడిశా గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రామ్‌, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా డాక్టర్ ధల్ సింగ్ బిసెన్‌, సిక్కిం గవర్నర్ పదవిలో దుష్యంత్ గౌతమ్‌ నియమితులయ్యారు.

అందరూ బీజేపీ వారే :

ఇక కొత్త గవర్నర్లు అందరూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖులు ఉన్నారు. వారికే ఈ పదవులు దక్కాయి. ఇక తమిళనాడు కేరళ కలిపి గతంలో వ్యవహరించిన రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్ అయ్యారు. ఇక రాజస్థాన్ కి చెందిన ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందిస్తున్న సీనియర్ నేత ఓం ప్రకాశ్ మాథుర్ కేరళ కొత్త గవర్నర్ అయ్యారు. కర్ణాటక కొత్త గవర్నర్ గా నియమితులైన డాక్టర్ సుధా యాదవ్‌ హర్యానాలోని రేవారి జిల్లాకు చెందిన వారు. సుధా యాదవ్ 1999 నుండి 2004 వరకు 13వ లోక్‌సభలో మహేంద్రగఢ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2022 ఆగస్టు 2022లో ఆమెను బీజేపీ అత్యున్నత నిర్ణయాధికార మండలి అయిన పార్లమెంటరీ బోర్డు సభ్యురాలిగా సేవలు అందించారు.

వారికే అందలం :

అంతే కాదు ఒడిషా నూతన గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రామ్ ను నియమించారు. ఈయన కూడా బీజేపీకి చెందిన సీనియర్ నేత కావడం విశేషం. ఇక ఉత్తరాఖండ్ గవర్నర్‌గా డాక్టర్ ధల్ సింగ్ బిసెన్‌ కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి మాజీ ఎంపీ బీజేపీకి చెందిన సీనియర్ నేతగా ఉన్నారు. సిక్కిం గవర్నర్ పదవిలో దుష్యంత్ గౌతమ్‌ సైతం బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇలా మొత్తం ఆరు రాష్ట్రాలకు గవర్నర్ పదవులను నియమిస్తే అందరూ బీజేపీకి చెందిన వారే ఉండడం విశేషంగానే చూస్తున్నారు. మిత్ర పక్షాలకు అవకాశాలు ఇస్తారని ప్రచారం జరిగినా కూడా ఎందుకో ఆ ఊసే లేదని అంటున్నారు.

మరో విడత ఉంటుందా :

ప్రస్తుతం ఆరు రాష్ట్రాలకు గవర్నర్ పదవులను భర్తీ చేసిన కేంద్రం మరో విడతలో అయినా మిత్ర పక్షాలకు ముఖ్యంగా టీడీపీకి గవర్నర్ పదవుల్లో ఛాన్స్ ఇస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో గవర్నర్ పదవిని కేటాయించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి స్పష్టమైన సంకేతాలు అయితే ఉన్నాయి. గతంలోనే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించి మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తామనే సంకేతాన్ని మోదీ ప్రభుత్వం ఇచ్చింది. తదుపరి విడత నియామకాల్లో టీడీపీ కోటా కింద ఒకరికి గవర్నర్ పదవి ఇవ్వవచ్చు అని ఊహాగానాలు అయితే ఉన్నాయి. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన లేదా మిగిలిన రాష్ట్రాల గవర్నర్ల భర్తీ ప్రక్రియ చేపట్టినప్పుడు మిత్రపక్షాల కోటాను అధికారికంగా భర్తీ చేసే అవకాశం ఉంది అంటున్నారు.

Tags:    

Similar News