60 రోజుల సీజ్‌ఫైరా? ఇంకేమైనా ఉందా?".. ఉక్రెయిన్ ఓట్ల పండుగకు రష్యా 'వన్ డే ఆఫర్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏళ్లు గడుస్తున్నా, గన్స్ శబ్దం తగ్గడం లేదు గానీ మధ్యమధ్యలో వచ్చే ఇలాంటి ప్రతిపాదనలు మాత్రం మంచి కామెడీ స్క్రిప్ట్‌లను తలపిస్తున్నాయి.

Update: 2026-10-12 16:00 GMT

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ '60 రోజుల పాటు గన్స్ పక్కన పెట్టి ఓట్ల పండుగ చేసుకుందాం' అని ప్రతిపాదిస్తే క్రెమ్లిన్ నుంచి వచ్చిన సమాధానం చాలా సింపుల్ "60 రోజులా? అబ్బే... చాలా ఎక్కువ పోనీ ఒక్క రోజు ఇస్తాం.. ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో ఓట్లు వేసేసుకోండి... ’ అంటూ సమాధానమిచ్చారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏళ్లు గడుస్తున్నా, గన్స్ శబ్దం తగ్గడం లేదు గానీ మధ్యమధ్యలో వచ్చే ఇలాంటి ప్రతిపాదనలు మాత్రం మంచి కామెడీ స్క్రిప్ట్‌లను తలపిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరపాలంటే ముందు రష్యా మిస్సైళ్లకు 'పాజ్ ' బటన్ నొక్కాలి. అందుకే జెలెన్‌స్కీ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను రష్యా ముందుంచారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అండ్ కో "రెండు నెలల పాటూ సైలెంట్‌గా ఉండటం మా వల్ల కాదు బాస్" అని తేల్చేశారు. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ "మాకు తాత్కాలిక విరామాలు కావు, ఏకంగా శాశ్వత శాంతి ఒప్పందాలే కావాలి" అని చాలా సీరియస్‌గా చెప్తూనే ఓటింగ్ కోసం 'వన్ డే ఆఫర్' ఇచ్చేశారు. అంటే ఓటర్లు ఉదయాన్నే క్యూలో నిలబడి, మధ్యాహ్నానికి ఓటేసి, సాయంత్రానికి మళ్లీ బంకర్లలోకి పరిగెత్తాలన్నమాట..

ఇక జెలెన్‌స్కీ కథ చూస్తే... ఆయన ఐదేళ్ల అధ్యక్ష పదవీకాలం 2024లోనే అధికారికంగా ముగిసింది. కానీ దేశంలో మార్షల్ లా యుద్ధ ప్రాతిపదికన సైనిక పాలన నడుస్తుండటంతో ఎన్నికలు పెట్టడానికి వీలులేక ఆయనే కంటిన్యూ అవుతున్నారు. "ఎన్నికలు పెట్టడం లేదేంటి?" అని అడిగితే "యుద్ధం నడుస్తోందిగా" అని.. "యుద్ధం ఆపండి" అంటే "రష్యా ఒప్పుకోవట్లేదుగా" అని ఒక లూప్‌లా మారిపోయింది.

మొత్తానికి 'వన్ డే సీజ్‌ఫైర్' ఆఫర్‌తో రష్యా తన స్టైల్‌లో దౌత్యనీతిని ప్రదర్శిస్తే 60 రోజుల ప్లాన్ వర్కవుట్ కాక ఉక్రెయిన్ సైలెంట్ అయిపోయింది. శాశ్వత శాంతి ఒప్పందం మా లక్ష్యం అని చెప్తున్న రష్యా యుద్ధానికి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టే సూచనలు విసరడం లేదు. మరి ఈ 'వన్ డే ధనాధన్ ఓటింగ్' ఆఫర్‌పై ఉక్రెయిన్ ఎలా స్పందిస్తుందో లేక అంతర్జాతీయ మధ్యవర్తులు వచ్చి ఇంకేదైనా కొత్త ఆఫర్ తెస్తారో వేచి చూడాల్సిందే..

Tags:    

Similar News