అందుకే జగన్ ఓడిపోయారు.. కూటమిపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-10-12 14:23 GMT

2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, ఆయన వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించిన ఆయన ఏపీలో ఏం జరిగిందో చూడండి అంటూ అనుమానాలు రేకెత్తించేలా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్ ఎందుకు ఓడిపోయారు? టీడీపీ, జనసేన, బీజేపీ చేతుల కలపడం వల్లే కదా? అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఏపీ ఎన్నికలపై మరోసారి వాడివేడి చర్చకు కోమటిరెడ్డి తెర తీశారని అంటున్నారు.

స్థానిక ఎన్నికల వేళ కోమటిరెడ్డి కలకలం

సీఈసీ టార్గెట్ గా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుండగా, రెండేళ్ల క్రితం నాటి ఎన్నికలలో కూడా అక్రమాలు జరిగియాన్న అభిప్రాయం కలిగేలా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్ ప్రక్రియ నిర్వహించి భారీగా ఓట్లు తొలగించారని కోమటిరెడ్డి ఆరోపించారు. పశ్చిమబెంగాల్ లో మూడు సార్లు పనిచేసిన ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తొలగించి 4 వేల ఓట్లతో ఓడించారని, అదేవిధంగా తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నియోజకవర్గంలో 70 వేల ఓట్లు తొలగించి ఆయనను ఓడించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే 2024లో ఏపీలో కూడా ఇలానే జరిగిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవడానికి రెండు రోజుల ముందు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

2024లో సీఈసీ రాజీవ్ కుమార్

సీఈసీ జ్ఞానేష్ కుమార్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన కోమటిరెడ్డి వ్యాఖ్యలను రాజకీయంలో భాగంగా చూస్తున్నప్పటికీ ఆయన 2024లో ప్రధాన ఎన్నికల కమిషనర్ కాదన్న విషయాన్ని విస్మరించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2024లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ పనిచేశారని గుర్తు చేస్తున్నారు. విమర్శలు, ఆరోపణలు చేసే ముందు కోటమిరెడ్డి వంటి సీనియర్ నాయకులు వాస్తవాలు సరి చూసుకోవాలని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. 2025లో సీఈసీగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారని, ఏపీ ఎన్నికలతో ఆయనకు ఏం సంబంధమో మంత్రి కోమటిరెడ్డి చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

వైసీపీకి నైతిక బలం

2024 ఎన్నికల్లో ఈవీఎంల కారణంగానే తాము ఓడిపోయామని ఇన్నాళ్లు చెబుతున్న వైసీపీకి తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలతో మరింత నైతిక బలం లభించినట్లైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో ఈ వ్యాఖ్యలను ఆ పార్టీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయొచ్చని అంటున్నారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు వైసీపీకి లాభం దక్కక పోయినప్పటికీ, భవిష్యత్తులో సీఈసీపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఫలితాల బట్టి వైసీపీకి లాభనష్టాలు ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News