ధర్మానకు శీల పరీక్ష.. !
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీలకమైన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైసిపి ఏ విధంగా ముందుకు సాగుతుంది?.
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీలకమైన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైసిపి ఏ విధంగా ముందుకు సాగుతుంది?. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాన్ని తెచ్చుకుంటుంది? అనేది ఆసక్తిగా మారింది. కీలక మైన నాయకుడిగా గుర్తింపు పొందిన ధర్మాన ప్రసాదరావుకు ఈ ఎన్నిక ఒకరకంగా శీల పరీక్ష పెడుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా గత రెండున్నర ఏళ్ల కాలంలో వైసిపి తరఫున శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో పెద్దగా కార్యక్రమాలు ఏవి చేపట్టలేదు.
ఒక్క కార్యక్రమంలో మాత్రమే ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నప్పటికీ బలమైన ముద్రనైతే వేయలేకపోయారు. కానీ, పార్టీ పరంగా ధర్మాన తర్వాత ఇంకెవరూ లేరు అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఏ విధంగా పార్టీని గెలుపు దిశగా అడుగులు వేసేలా చేస్తారు అన్నది ప్రశ్న. ప్రధానంగా కూటమిక్కడ బలంగా పనిచేస్తుంది. శ్రీకాకుళం నియోజకవర్గ కావచ్చు శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు మొత్తంగా టిడిపి జనసేన ల ప్రభావం భారీగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో బలమైన కూటమి పక్షాలను ఎదుర్కొని ఇక్కడ వైసిపి పాగా వేయాలి అంటే ధర్మాన ఇంతకు నాలుగింతల కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో ధర్మాన గెలుపు దిశగా అడుగులు వేస్తే తప్ప వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఇమేజ్ బలపడడంతో పాటు ఆయన ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికిప్పుడు పరిస్థితిని చూస్తే కూటమికే శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో అనుకూలమైన వాతావరణం ఉంది.
మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి కార్పొరేషన్ మేయర్ సీటు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. దీనిని టిడిపికే కేటాయిస్తే గుండె లక్ష్మీదేవి విజయం సాధించడం సునాయాసం అవుతుంది అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక వ్యక్తిగతంగా లక్ష్మీదేవికి ఉన్న మెజారిటీ మహిళా ఓటు బ్యాంకు మాజీ ఎమ్మెల్యేగా ఆమెకు ఉన్న గుర్తింపు కుటుంబ పరంగా ఉన్న ఇమేజ్ వంటివి కూడా కలిసి వస్తాయని అంటున్నారు. ఇవన్నీ దాటుకుని వైసీపీని ఇక్కడ గెలిపించడం కార్పొరేషన్ లో పాగా వేయటం అనేది ధర్మానకు శిల పరీక్షగా మారనుందని తెలుస్తోంది. మరి ఏం చేస్తారనేది చూడాలి.