విశాఖ మేయర్ రేసులో బాలయ్య కుమార్తె ?

విశాఖ వంటి ఏపీలో నంబర్ వన్ కార్పొరేషన్ మేయర్ పదవి చేపట్టాలని అంతా చూస్తారు. మంత్రి పదవితో సరి సమానం అయిన హోదా అది.

Update: 2026-10-13 01:04 GMT

విశాఖ వంటి ఏపీలో నంబర్ వన్ కార్పొరేషన్ మేయర్ పదవి చేపట్టాలని అంతా చూస్తారు. మంత్రి పదవితో సరి సమానం అయిన హోదా అది. అయిదు వేల కోట్ల వార్షిక బడ్జెట్ తో కూడా జీవీఎంసీని నడిపించే అరుదైన గౌరవం, విశాఖ వంటి ఆసియాలోనే నంబర్ వన్ సిటీకి ప్రధమ పౌరుడిగా ఉండే మహా భాగ్యం ఇవన్నీ చూస్తే కనుక జీవీఎంసీ మేయర్ పదవి కోసం ఎవరైనా క్యూ కడతారు. ఇపుడు అదే పరిస్థితి ఉంది. రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాత విశాఖ మేయర్ మహిళా కోటాలో జనరల్ గా ఉంది. అంటే మహిళా మేయర్ ని విశాఖ చూస్తుంది అన్న మాట.

వరుసగా రెండవసారి :

విశాఖ మహిళా మేయర్ అన్నది వరసగా రెండవసారి చూడబోతోంది. 2021లో విశాఖ ఓపెన్ కేటగిరీలో జనరల్ గా ఉంది. అయితే బీసీ వర్గానికి చెందిన మహిళను మేయర్ గా నాటి వైసీపీ ప్రభుత్వం చేసింది. ఇక ఇపుడు చూస్తే ఏకంగా మహిళకే రిజర్వ్ అయింది. దాంతో మరోసారి పురుషులు అంతా నిరాశకు గురి అవుతున్నారు. అయితే మహిళల నుంచి కూడా పెద్ద పోటీ ఏర్పడుతోంది. అది కూడా బిగ్ షాట్స్ నుంచే అని అంటున్నారు. ఎన్నో పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఒక పేరు మాత్రం గాసిప్ గా సోమవరం రోజంతా ప్రచారం అవుతోంది. ఆ పేరే నందమూరి తేజస్విని. ఆమె ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ రెండవ కుమార్తె. అలాగే విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్ సతీమణి. దాంతో ఆమె పేరు అయితే ఇపుడు అంతటా పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

ఆసక్తి ఉందా :

ఇంతకీ తేజస్వినికి ఆసక్తి ఉందా అన్నదే చర్చ. ఆమె పేరు అయితే 2029 ఎన్నికల్లో భీమిలీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా అని కూడా అంటూ వచ్చారు. ఇపుడు మేయర్ సీటుకే ఆమె పేరుని ప్రతిపాదిస్తున్నారు. అయితే తేజస్వినికి ఆసక్తి ఉందా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు. బహుశా ఆమె పోటీ చేయకపోవచ్చు అని అంటున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అని కూడా అంటున్నారు. తేజస్విని కనుక మేయర్ అభ్యర్ధిగా కూటమి నుంచి బరిలోకి దిగితే మాత్రం తిరుగులేని మెజారిటీతో గెలుస్తారు అని అంటున్నారు.

వీరి పేర్లు సైతం :

ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, గాజువాక ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాస్ సతీమణి లావణ్య పేరు కూడా వినిపిస్తోంది. ఆమె ఉన్నత విద్యావంతురాలుగా ఉన్నారు. అలాగే బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో ఆమెకు టికెట్ ఇస్తే విజయం సునాయాసం అని అంటున్నారు. ఇక విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ పట్టాభిరాం సతీమణి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. జనసేన నుంచి పెద్దిశెట్టి ఉషశ్రీ, అలాగే ఉత్తర జనసేన ఇంచార్జి ఉషా కిరణ్ పేర్లు నలుగుతున్నాయి. బీజేపీ నుంచి ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కుమార్తె పోటీ చేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది.

వైసీపీ నుంచి ఎవరు :

అదే సమయంలో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నది మరో చర్చగా ఉంది. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరు వినిపిస్తోంది. అయితే ఆమె ఎంపీగా చేసిన వారుగా ఉన్నారు. ఈ పదవికి పోటీకి నిరాకరిస్తున్నారు. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న వరుదు కళ్యాణి పేరు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యేల వారసులు ఎవరైనా దిగుతారేమో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News