బీసీ కార్డు...మహిళలకు చాన్స్...కూటమి భలే వ్యూహం !

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూటమి మంచి వ్యూహం అమలు చేస్తోంది. జనాభాలో సగం దాకా ఉన్న బీసీలను మచ్చిక చేసుకునేందుకు వారికి న్యాయమైన తీరులో రిజర్వేషన్లు ఖరారు చేసింది

Update: 2026-10-13 03:31 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూటమి మంచి వ్యూహం అమలు చేస్తోంది. జనాభాలో సగం దాకా ఉన్న బీసీలను మచ్చిక చేసుకునేందుకు వారికి న్యాయమైన తీరులో రిజర్వేషన్లు ఖరారు చేసింది. అదే విధంగా జనాభాలో సగం ఉన్న మహిళలకు కూడా రిజర్వేషన్ల ద్వారా ఉన్నత పదవులను కట్టబెడుతోంది. ఈ విధంగా రెండు వైపులా పదునైన వ్యూహంతో కూటమి స్థానిక ఎన్నికల బరిలోకి అత్యంత ధీమాతో దిగుతోంది. ఏపీలో మొత్తం పదవులలో బీసీలకు పెద్ద వాటా దక్కేలా కూటమి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇదీ పక్కాగా లెక్క :

ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పదవుల్లో బీసీలకు గరిష్ట ప్రాధాన్యత కల్పించేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యాయపరమైన పరిమితుల వల్ల అధికారిక రిజర్వేషన్లు తగ్గినా కూటమి పార్టీల తరఫున అభ్యర్థుల ఎంపికలో బీసీలకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. ఇక చూస్తే కోర్టు ఉత్తర్వుల ప్రకారం అధికారికంగా సగటున 28.18 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఖరారైనప్పటికీ కూటమి పార్టీలు తమ సొంత కోటా నుండి అదనపు టికెట్లు కేటాయించి బీసీలకు 34 శాతం నుండి 40 శాతం వరకు రాజకీయ వాటా దక్కేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. దీంతో ఏపీలో బీసీలకు పెద్ద ఎత్తున పదవులు పరం కానున్నాయని అంటున్నారు.

వేలాదిగా పదవులు :

ఇక సర్పంచ్ స్థానాలలో 27.95 శాతం పంచాయతీ వార్డు మెంబర్లు 26.73 శాతం జెడ్పీటీసీ స్థానాలు 24.60 శాతం, జెడ్పీ చైర్మన్ పదవులు 23.08 శాతం ఇలా చూస్తే కనుక కూటమి పార్టీల టికెట్ల వాటా 40 శాతం వరకూ బీసీ అభ్యర్థులకు కేటాయింపు చేశారు. దీంతో మొత్తంగా చూస్తే నాలుగు వేల పదవులకు పైగా అదనంగా బీసీలకు దక్కుతున్నట్లు అవుతోంది అంటున్నారు. దీంతో బీసీలకు కూటమి పెద్ద పీట వేస్తోంది అన్న సందేశం అయితే వెనకబడిన వర్గాలకు చేరింది అని అంటున్నారు.

మహిళల రిజర్వేషన్లు చూస్తే :

ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు కూడా చూస్తే గణనీయంగానే ఉన్నాయని విశ్లేషణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు గణనీయంగా పెరగడం అనేది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని నాయకత్వాన్ని బలపరచడంలో ఒక చారిత్రాత్మక మార్పుగా నిలుస్తుందని కూటమి నేతలు చెబుతున్నారుంది. దీంతో అనేక మేయర్ జిల్లా పరిషత్ చైర్మన్లు అలాగే మునిసిపల్ చైర్మన్లు అధిక భాగం మహిళలకే దక్కుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల వాటాను కూడా దృష్టిలో పెట్టుకుని ఖరారు చేసింది.

నూరు శాతం స్ట్రైక్ రేటు :

దీంతో రాష్ట్రంలోని మొత్తం 17 మేయర్ స్థానాల్లో మహిళలకు సగానికి పైగా ప్రాధాన్యత లభించింది. ఆలాగే, రాష్ట్రంలోని మొత్తం 106 మున్సిపాలిటీలలో మహిళలకు దాదాపు 50 స్థానాలను కేటాయించడం జరిగింది. ఇలా బీసీలు మహిళలకు పూర్తి న్యాయం చేస్తూ టీడీపీ కూటమి బరిలోకి దిగుతోంది. ఇక విజయం ఖాయం అంతే కాదు నూరు శాతం స్ట్రైక్ రేటు కూడా ఖాయమని కచ్చితంగా కూటమి నేతలు చెబుతున్నారు. చూడాలి మరి స్థానిక పోరులో మరెన్ని విశేషాలు ఉంటాయో.

Tags:    

Similar News