దవాఖానా నడవాలంటే ధరలు చెప్పాల్సిందే !
భారతదేశంలో మెడికల్ టూరిజాన్ని బలోపేతం చేయడానికి అంతర్జాతీయ రోగులకు సంబంధించిన ప్యాకేజ్ ధరలు ప్రముఖంగా డిస్ ప్లే చేయాలని పేర్కొన్నారు.
ఆసుపత్రులు తాము అందించే సేవలు, సదుపాయాలు, వాటికి సంబంధించిన ధరలను స్థానిక భాషతో పాటు ఆంగ్ల భాషలో ఆసుపత్రి వద్ద డిస్ ప్లే చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యూనియన్ హెల్త్ సెక్రటరీ పుణ్య సలీలా శ్రీవాస్తవ ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖలు రాయడం జరిగింది.
భారతదేశంలో మెడికల్ టూరిజాన్ని బలోపేతం చేయడానికి అంతర్జాతీయ రోగులకు సంబంధించిన ప్యాకేజ్ ధరలు ప్రముఖంగా డిస్ ప్లే చేయాలని పేర్కొన్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి ఖర్చులను ముందుగానే అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించడంతో పాటు, బిల్లింగ్ విషయంలో రోగులకు, ఆసుపత్రులకు మధ్య వివాదాలు రాకుండా పారదర్శకత, విశ్వాసం పెంచడమే లక్ష్యంగా ఈ ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తుంది.
ఆరోగ్య సేవల ధరలో పారదర్శకత లేకపోవడం, బిల్లులు అనూహ్యంగా పెరిగిపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఆసుపత్రులు తమ సేవల ధరలను వెల్లడించాలన్న నిబంధన 2010, 2012 చట్టాల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం ఆయా రాష్ట్రాలను ఈ విషయంలో రివ్యూ చేసి కఠినంగా అమలు చేయాలని వెల్లడిస్తుంది.
సుప్రీంకోర్టు 2024లోనే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) ధరల గురించి ఆరాతీసింది. క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ 2012లో ధరలు వెల్లడించాలని, కేంద్రం ధరల పరిధి నిర్ణయించాలని నిబంధనలు ఉన్నాయి. దీనికి ముందు కేరళ హైకోర్టు కూడా ఆసుపత్రులు సేవల ధరలను వెల్లడించాలని ఆదేశాలు ఇచ్చింది.
దీనికి సంబంధించి 2025 డిసెంబరులో ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ దాఖలు చేసిన పిటీషన్ మీద సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయా ? ఆదేశాలకే పరిమితం అవుతాయా ? అన్నది వేచిచూడాలి.