అక్కడ కోలగట్ల వారసురాలు రెడీనా ?

విజయనగరం మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. రాజకీయాల్లో అంతా ఉల్టా సీదా వ్యవహారంగానే ఉంటుంది.

Update: 2026-10-13 03:31 GMT

విజయనగరం మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. రాజకీయాల్లో అంతా ఉల్టా సీదా వ్యవహారంగానే ఉంటుంది. అవకాశాలు అందుబాటులో ఉన్నపుడు ఏదో అడ్డంకి ఎదురవుతుంది. ఇపుడు అడ్డంకులు లేవని అనుకుంటే అవకాశాలు ఉన్నాయా అన్నీ అనుకూలిస్తాయా అన్నది కూడా ఒక సందేహం. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఒక రాజకీయ కుటుంబంలో ఇదే చర్చ సాగుతోంది అంటున్నారు. 2021లో తన కుమార్తెను ఎలాగైనా మేయర్ గా చేయాలని విజయనగరం ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి అనుకున్నారు. దాని కోసం పూర్వ రంగం అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే రిజర్వేషన్లలో తకరారు వచ్చి పడింది. ఆనాడు బీసీ మహిళకు విజయనగరం మేయర్ సీటు ఖరారు అయింది. దాంతో ఓసీ కేటగిరీకి చెందిన కోలగట్ల తన కుమార్తెను బరిలోకి దించలేకపోయారు అని ఆయన అభిమానులు అంతా ఆవేదన వ్యక్తం చేశారు.

తెర వెనక ఏదో అంటూ :

ఇక ఆనాడు తెర వెనక ఏదో జరిగింది అన్నది కూడా రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపించాయి. విజయనగరం జిల్లా పరిషత్తు జనరల్ మహిళ అయిందని దానిని తీసి వేసి ఓపెన్ కేటగిరీలోకి తేవడానికి విజయనగరం మేయర్ సీటుని బీసీగా చేశారు అన్న ప్రచారం నాడు జరిగింది. ఇంతా చేస్తే ఆ పదవిని అందుకుని అయిదేళ్ళూ రాజ్యం చేసిన వారు పార్టీ గూడు దాటేశారు అని వైసీపీ వారు ఫ్లాష్ బ్యాక్ ని తలచుకుంటున్నారు. ఇపుడు విజయనగరం మేయర్ సీటు సరిగ్గా ఓపెన్ కేటగిరీ అయింది. మహిళకే రిజర్వ్ కూడా చేశారు. మరి రిజర్వేషన్ల పరంగా ఇబ్బంది లేదని తేలిపోయినపుడు కోలగట్ల ఫ్యామిలీ మేయర్ సీటుకు బరిలో ఉంటుందా అన్నదే చర్చగా ఉంది.

ఆమె బెస్ట్ ఆప్షన్ :

ఇపుడు వైసీపీకి కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి బెస్ట్ ఆప్షన్ గా ఉన్నారు అని అంటున్నారు. పైగా ఆమె గత అయిదేళ్ళూ డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. ఆ అనుభవం ఉంది. దాంతో పాటు వీరభద్రస్వామి పరపతి ఉంది. విజయనగరంలో కోలగట్ల సామాజిక వర్గం ఓట్లు యాభై వేల దాకా ఉన్నాయి. దాంతో శ్రావణి బరిలోకి దిగితే బాగానే ఉంటుందని అంటున్నారు. అయితే కూటమి మరో వైపు గట్టిగా ఉంది. మూడు పార్టీలు కలసి ముందుకు వస్తున్నాయి. దాంతో ఎదుర్కోవడం కష్టమేనా అన్న చర్చ సాగుతోంది. జనరల్ మహిళ అయినా కూటమి బీసీ కార్డుతో తూర్పు కాపు అభ్యర్ధితో ముందుకు రావచ్చు అని అంటున్నారు. అదే కనుక జరిగితే సామాజిక సమీకరణలు వేరేగా ఉంటాయన్నది కూడా ఉంది.

కోలగట్ల ఏం చేస్తారో :

ఇదిలా ఉంటే కోలగట్ల ఫ్యామిలీ జనసేనలోకి వెళ్తుందని ప్రచారం ఈ మధ్యనే సాగుతూ వచ్చింది. అయితే దానిని ఆయన ఖండించారు. కానీ ఇంకా ఆ గాసిప్స్ అలాగే ఉన్నాయి. మరి వైసీపీ నుంచి కోలగట్ల తన కుమార్తెని పోటీకి దించుతారా లేక గమ్మున ఉంటారా అన్నది కూడా చర్చగా ఉంది. ఎందుకంటే ఆయన చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు అని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో మేయర్ సీటుకు పోటీ అంటే ఖర్చు అధికంగా ఉంటుంది. గెలుపు ధీమా అయితే ఉందా అంటే రిస్క్ చేయడమే అని అంటున్నారు. దాంతో ఆ రిస్క్ ని ఆయన చేస్తారా అని అంతా ఆలోచిస్తున్నారు. కోలగట్ల ఫ్యామిలీ తప్పుకుంటే వైసీపీకి గట్టి అభ్యర్ధి మేయర్ సీటుకు ఎవరు అన్నది మరో చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News