ఆంధ్రాకు ఆరు లేడీ టైగర్స్.. నల్లమల అడవుల్లో పవన్ కల్యాణ్ సరికొత్త ప్రయోగం
రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయిన పవన్ రాష్ట్రంలో అడవుల రూపురేఖలు మార్చేలా ఒక ఆసక్తికరమైన, వ్యూహాత్మకమైన ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచారు. రాష్ట్రానికి ఆరు ఆడ పులులను కేటాయించాలని కోరారు. ఆయన ప్రతిపాదనను కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని చెబుతున్నారు. దీంతో పర్యావరణ సమతుల్య దిశగా కీలక అడుగులు వేసినట్లుగా చెబుతున్నారు.
నల్లమలలో తగ్గుతున్న పులుల సంతతి
తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత పెద్దదైన నల్లమల అటవీ ప్రాంతం, ముఖ్యంగా నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణకు ఎంతో పేరుగాంచింది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, ఆడ పులుల సంఖ్య తగ్గడం వంటి కారణాల వల్ల గత కొంతకాలంగా ఇక్కడ పులుల సంతతి పెరుగుదల మందగించిందని చెబుతున్నారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు.
కేంద్ర మంత్రితో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా 'లేడీ టైగర్స్' ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. నల్లమల అడవుల్లో పులుల బ్రీడింగ్ పెంచేందుకు వీలుగా దేశంలోనే అత్యధికంగా పులుల జనాభా ఉన్న రాష్ట్రాల నుండి ఆడ పులులను ఏపీకి తరలించాలని ఆయన కోరారు. మహారాష్ట్ర నుండి 4 ఆడ పులులను తీసుకురావడానికి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సానుకూలంగా స్పందించి అనుమతి ఇచ్చారని పవన్ తెలిపారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ నుండి 2 ఆడ పులులను తీసుకురావడానికి అక్కడి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని స్పష్టం చేశారు.
ఈ మొత్తం 6 ఆడ పులులను ఏపీలోని టైగర్ రిజర్వ్ ఏరియాలోకి ప్రవేశపెట్టడం ద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అడవుల్లో పులుల జనాభాను భారీగా పెంచవచ్చని డిప్యూటీ సీఎం భావిస్తున్నారు. పులులను తీసుకురావడమే కాకుండా వాటి భద్రత కూడా అంతే ముఖ్యమని పవన్ కల్యాణ్ గుర్తించారు. అందుకోసం నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో ప్రస్తుతం ఉన్న అటవీ బేస్ క్యాంపులను 90 నుండి 150 కి పెంచాలని, దీనికోసం కేంద్రం అదనపు నిధులు కేటాయించాలని కోరారు. తద్వారా వేటగాళ్ల బారి నుండి, ఇతర ప్రమాదాల నుండి వన్యప్రాణులను రక్షించవచ్చని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వన్యప్రాణుల సంరక్షణలో పవన్ మార్క్
గతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అడవి ఏనుగుల దాడుల సమస్యను పరిష్కరించడానికి పవన్ కల్యాణ్ కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాల సహాయంతో ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను ఏపీకి రప్పించారు. ఏనుగులకు ఎలాంటి హాని చేయకుండా, మానవ-వన్యప్రాణుల ఘర్షణను నివారించడంలో ఆ ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తోంది. అదే పంథాలో ఇప్పుడు ఏపీని ఒక బలమైన టైగర్ కన్జర్వేషన్ జోన్ గా మార్చడానికి పవన్ అడుగులు వేస్తున్నారని అంటున్నారు. పులులతో పాటు మధ్యప్రదేశ్ నుండి 50 అడవి దున్నలను కూడా తీసుకురావడానికి ఒప్పందం కుదిరిందని, ఇవి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి రాష్ట్రానికి చేరుకుంటాయని పవన్ కల్యాణ్ వివరించారు.
పర్యావరణ ప్రేమికుల ప్రశంసలు
కేవలం రాజకీయాలు, నిధుల సమీకరణే కాకుండా.. అంతరించిపోతున్న అటవీ సంపదను, వన్యప్రాణులను కాపాడటానికి పవన్ కల్యాణ్ చూపుతున్న చొరవపై పర్యావరణ ప్రేమికులు, అటవీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 'లేడీ టైగర్స్' ప్రాజెక్ట్ గనుక విజయవంతమైతే.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు కూడా పులులను అందించే స్థాయికి ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.