దసరా తర్వాత వస్తా.. డిప్యూటీ సీఎం కమిట్మెంట్ చూశారా?

డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా ఉన్న పవన్ క్షేత్ర స్థాయి పర్యటనల్లో తన ద్రుష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు చురుగ్గా స్పందిస్తున్నారు.;

Update: 2025-09-21 17:12 GMT

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా యాగ్రసివ్ లీడర్ అంటారు. ప్రతిపక్షంలో ఉండగా, ప్రజాసమస్యలపై మడమతిప్పని పోరాటం చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అధికారంలోకి వచ్చిన ఆయన తన బాణీ మార్చుకోలేదని నిరూపించుకుంటున్నారు. సమస్యలపై తనదైన స్టైల్ లో స్పందిస్తూ ప్రజలకు భరోసానిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో కీలకంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ తాజాగా కోనసీమ రైతుల సమస్యపై స్పందించిన తీరు అబ్బురపరుస్తోందని ప్రశంసలు అందుకుంటున్నారు.

డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా ఉన్న పవన్ క్షేత్ర స్థాయి పర్యటనల్లో తన ద్రుష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు చురుగ్గా స్పందిస్తున్నారు. అదే సమయంలో కీలకమైన శాఖలను పర్యవేక్షిస్తున్న ఆయన దీర్ఘకాలంగా ప్రజలను వేధిస్తున్న సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా గిరిజనుల డోలీ మోతల సమస్య పరిష్కరించేందుకు ‘పల్లె పండుగ’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి వేల కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షించాలనే ఉద్దేశంతో సామాన్యుడైన అంకారావు అనే జర్నలిస్టును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమంచారు.

ఇలా తన పనితీరుతో సాధారణ, సామాన్యులను ఆకట్టుకుంటున్న పవన్ తాజాగా కోనసీమ రైతుల సమస్యపైనా స్పందించిన తీరు చర్చనీయాంశయమయైంది. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలోని శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరడం మూలంగా కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొబ్బరి చెట్లు తలలు వాల్చేసి వేల ఎకరాలు దెబ్బ తిన్నాయి. ఈ విషయం డిప్యూటీ సీఎం ద్రుష్టికి రాగా, ఆయన తక్షణం స్పందించారు. మిగిలిన నాయకుల్లా పరిశీలించి చర్యలు తీసుకోండంటూ ఆదేశాలివ్వకుండా రైతు సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు పవన్.

సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం డ్రయిన్ లోకి చేరి అక్కడి నుంచి కొబ్బరి తోటల్లోకి పడుతోంది. ఫలితంగా చెట్లు తలలు వాల్చేసి దెబ్బ తింటున్నాయని రైతులు ఆవేదన చెందుతూ తమను ఆదుకోవాలని పవన్ కు విన్నవించారు. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం... ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని డిప్యూటీ సీఎం ద్రుష్టికి తీసుకువెళ్లారు. అయితే ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్న పవన్, దసరా తరవాత వస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు, కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలను తీసుకువెళ్లి కొబ్బరి రైతుల సమస్యకు చెక్ చెప్పాలని పవన్ యోచిస్తున్నారు. దీంతో తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. గతంలో ఇలాంటి సమస్యలు వస్తే కాళ్లు అరిగేలా తిప్పించుకున్న నేతలను చూశామని, కానీ తమ గోడు విన్నవెంటనే డిప్యూటీ సీఎం ఏకంగా అధికారులను వెంటబెట్టుకుని వస్తానని చెప్పడం తొలిసారిగా చూస్తున్నామని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News