పవన్ దూకుడు పెంచాల్సిందేనా ?

ఇక పవన్ చాలా తక్కువగానే మీడియా ముందు కానీ జనంలోకి రావడం కానీ చేస్తున్నారు అన్నది ఏడాది కూటమి పాలనలో ఒక రిపోర్టుగా ఉంది.;

Update: 2025-06-13 03:45 GMT

జనసేన అధినేతగా విపక్ష నేతగా ఉన్నప్పటి దూకుడు పవన్ కళ్యాణ్ నుంచి జనాలు పార్టీ జనాలూ కోరుకుంటున్నారు. అఫ్ కోర్స్ ప్రభుత్వంలో ఉండడం వల్ల ఉప ముఖ్యమంత్రి లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండడం వల్ల పవన్ ఏడాది కాలంగా సంయమనంతో సహనంతో ఉంటున్నారు అని అనుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో ఉంటూ కూడా డైనమిక్ గా వ్యవహరించాలన్నదే అంతా అంటున్న మాట.

ఏపీలో ఏడాది కూటమి పాలన ముగిసింది. పవన్ ముద్ర అయితే గట్టిగా పడలేదని ఆయనను మనసారా అభిమానించిన వారు అంటున్న మాటగా ఉంది. పవన్ ప్రభుత్వంలో ఉంటే ఆ లెక్కే వేరు ఆ కిక్కే వేరు అనుకున్న వారికి కిక్కి ఇంకా ఎక్కలేదని అంటున్నారు. ఏడాది పాలనలో చాలా చోట్ల ఇంకా వైసీపీ కాలం నాటి అవశేషాలే కనిపిస్తున్నాయని అంటున్నారు

మళ్ళీ చీప్ లిక్కర్ గ్రామాలను కబలిస్తోంది. మహిళల మీద అత్యాచారాలు అలాగే సాగుతున్నాయి. అంతే కాదు దందాలు అవినీతి అక్రమాలు అదే తీరున సాగుతున్నాయని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం గట్టిగా నిలబడితే బాగుంటుందని సూచిస్తున్నారు. అంతదాకా ఎందుకు పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ఇసుక దందా సాగుతోందని టీడీపీ నాయకుడు ఎసీఎస్ఎన్ వర్మ బాహాటంగానే కామెంట్స్ చేసారు.

మరి ఇంతలా జరుగుతున్నా పవన్ మునుపటి మాదిరిగా ఫైర్ చూపించడం లేదన్నదే చాలా చోట్ల అసంతృప్తిగా ఉంది. అంతే కాదు విధానపరమైన అంశాలలో పవన్ మార్క్ ఉండాలని కోరుకుంటున్న వారూ ఉన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పేరుకు కూటమి ప్రభుత్వమే కానీ టీడీపీ మార్క్ తో ఆ ముద్రతోనే ఏపీలో ఏడాది పాలన సాగింది అని అంతా విశ్లేషిస్తున్నారు.

పవన్ విషయలో తీసుకుంటే పల్లె పండుగ అన్నది ఒక వినూత్న కార్యక్రమంగా చేయించారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆయన ఏపీలో అభివృద్ధి విషయంలో తన మార్క్ ఆలోచనలను మరింతగా చూపించాల్సి ఉందని అంటున్నారు. అదే విధంగా దందాలు చేసే వారికి కఠిన హెచ్చరికలు పంపించాల్సి ఉందని అంటున్నారు.

ఇక పవన్ చాలా తక్కువగానే మీడియా ముందు కానీ జనంలోకి రావడం కానీ చేస్తున్నారు అన్నది ఏడాది కూటమి పాలనలో ఒక రిపోర్టుగా ఉంది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబుని చూసినా మంత్రి నారా లోకేష్ ని చూసినా వారు పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. జనంలో ఉంటున్నారు. లోకేష్ అయితే ప్రజా దర్బార్ ని నిర్వహిస్తూ అందరికీ చేరువ అవుతున్నారు.

పవన్ కి ఉన్న గ్లామర్ దృష్ట్యా ఆయన జిల్లా పర్యటనలు చేస్తూ రచ్చ బండ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అయితే ఆ కిక్కే వేరుగా ఉంటుందని అంటున్నారు అంతే కాదు దందాలు లేకుండా ఎక్కడికక్కడ కూటమి నేతలను కట్టడి చేస్తే ప్రభుత్వానికి పవన్ కి మంచి పేరు వస్తుందని అంటున్నారు. మరి రెండో ఏడాది అయినా పవన్ నుంచి ఆ తరహా దూకుడుని ఆశించవచ్చా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉంది.

Tags:    

Similar News