జనసేన మంత్రులు దూరం...ఏమి జరుగుతోంది ?

ఏపీ కేబినెట్ నెలలో ఠంచనుగా రెండు సార్లు సమావేశం అయి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Update: 2026-10-10 16:30 GMT

ఏపీ కేబినెట్ నెలలో ఠంచనుగా రెండు సార్లు సమావేశం అయి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధానాన్ని కచ్చితంగా అమలు అయ్యేలా చూస్తున్నారు. దీని వలన సకాలంలో మంత్రివర్గం స్పందించేందుకు వేగవంతమైన పరిష్కారాలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. మరో వైపు చూస్తే అత్యవసరమైన విషయాల్లో అర్జంటుగా మంత్రి వర్గ సమావేశాలను నిర్వహించడం కూడా జరుగుతోంది. ఈసారి అలాంటి సమావేశమే జరిగింది. స్థానిక సంస్థలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన రెండు ఉత్తర్వులను హైకోర్టు సుప్రీంకోర్టులు వరసగా కొట్టేశాయి. దీంతో ఈ విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అత్యవసరంగా మంత్రివర్గం సమావేశం జరిపింది.

ముగ్గురూ గైర్ హాజరుతో :

అయితే ఇంతటి కీలకమైన అంశం మీద జరిగిన కేబినెట్ మీటింగ్ కి జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు గైర్ హాజరు కావడం అయితే రాజకీయంగా అతి పెద్ద చర్చకు తావిచ్చింది. ఇలా ఎందుకు జరిగింది అన్నదే మంత్రి వర్గ నిర్ణయాల కంటే కూడా విస్తృతంగా చర్చకు ఆస్కారం కల్పించాయి. అయితే దాని మీద జనసేన వర్గాలు వివరణ ఇచ్చాయి. శనివారం మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు సమర్పించేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఉన్నారని ఆయన బృందం మీడియాకు తెలిపింది. ఇక చూస్తే మరో మంత్రి నాదెండ్ల మనోహర్ హైదరాబాద్‌లోనే ఉండటంతో సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. అలాగే మూడవ మంత్రి పర్యాటక శాఖను చూస్తున్న కందుల దుర్గేష్ స్పెయిన్ లో అధికార పర్యటనలో ఉండడంతో మీటింగ్ కి అటెండ్ కాలేకపోయారు అని చెప్పుకొచ్చారు.

విపక్షానికి ఆయుధమే :

అయితే జనసేన వర్గాల నుంచి వచ్చిన ఈ వివరాలు చూస్తే సహేతుకంగానే ఉన్నాయి. అయితే ఇలా మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వంలో ఒక బలమైన మిత్ర పక్షం నుంచి మొత్తానికి మొత్తం మంత్రులు గైర్ హాజరు అయ్యారు అంటే అది అతి పెద్ద రాజకీయ కలకలమే అవుతుంది. అసలు ఏమి జరుగుతోంది అన్నదే ముందుగా అందరిలో కలిగే ఆలోచనగా ఉంటుందని అంటున్నారు. పైపెచ్చు విపక్షం కాచుకుని ఉంది. దాంతో ఈ రకమైన గైర్ హాజరులు విపక్షానికి బలమైన ఆయుధాలుగా మారి కూటమి మీద జనంలో లేని పోని అనుమానాలు పెంచేందుకు అవకాశం ఇస్తాయని అంటున్నారు.

గతంలో కూడా :

అయితే పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే ఆయన గతంలో కొన్ని సార్లు కేబినెట్ కి హాజరు కాలేదు, దానికి ఆయన ఆరోగ్యపరమైన అంశాలే కారణాలుగా చెబుతూ వచ్చారు. అప్పట్లో కీలకమైన అంశాల మీద కేబినెట్ భేటీ అయిన సందర్భంలో ఈ గైర్ హాజర్ ని చూపించి పవన్ మీద విపక్షాలు విమర్శలు చేసేందుకు అవకాశం లభించింది. ముఖ్యంగా అమరావతి రాజధానిలో అవినీతి జరిగిందని విపక్ష వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. సరిగ్గా వాటి మీద మంత్రి వర్గ సమావేశాలు జరిగిన సందర్భంలోనే పవన్ గైర్ హాజర్ కావడంతో ఆ విషయాన్ని తమకు అనుకూలంగా వైసీపీ వంటి పార్టీలు మలచుకున్నాయని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అంటే మిత్ర పక్షాలు సమిష్టి బాధ్యత అందులో ఉంటుంది. పైగా రాజకీయం ఏపీలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటోంది. ఏ చిన్న తప్పు ఉన్నా లేకపోయినా వెతికే పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో ఏ చిన్న చాన్స్ కూడా ఇవ్వకుండా సాధ్యమైనంతవరకూ మిత్రులు అంతా వ్యవహరిస్తే బాగుంటుంది అన సూచనలు అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి.

Tags:    

Similar News