పవన్ నుంచి కోరుకున్నది ఇదే కదా? అవనిగడ్డలో ఏం చేశారో తెలుసా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పనితీరులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడుతున్నారు.;
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పనితీరులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడుతున్నారు. మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కోనసీమలో పర్యటిస్తే, ఉప ముఖ్యమంత్రి పవన్ ఈ రోజు దివసీమ వెళ్లారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో ఉండే దివిసీమ ప్రాంతం తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఈ విషయం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎంపీ వల్లభనేని బాలశౌరి ద్వారా తెలుసుకున్న పవన్ రైతుల బాధలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గురువారం ఉదయం నియోజకవర్గంలోని కోడూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు.
రాజధాని అమరావతి నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో కోడూరు మండలంలో దెబ్బతిన్న వరి పైర్లను పరిశీలించారు. అదేవిధంగా అవనిగడ్డ దగ్గర అరటి తోటలకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ బాలాజీతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన వెంట ఉండగా, పవన్ మాత్రం ముడుకుల్లోతు బురదలోకి దిగి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పంట చేతికి అందివచ్చిన దశలో తుఫాన్ ముంచేసిందని, భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నీటిలో మునిగిపోయి కుళ్లిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు వర్షాలు పడినా కౌలు రైతులు ఎక్కువగా నష్టపోతారని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తనను కలిసిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకున్న పవన్.. ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయి పర్యటనలో ఎక్కువ సేపు గడపటం, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లో తిరగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
నిజానికి పవన్ పర్యటన అంటే సినిమా షోలా ఉంటుందని రైతులు భావించారు. కానీ, ఆయన పర్యటనలో ఎక్కడ హంగామా కనిపించలేదని అంటున్నారు. తమ సమస్యలను తెలుసుకోడానికి పవన్ చూపిన చొరవ రైతులను ఆకట్టుకుందని అంటున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో పులిగడ్డ వద్ద రోడ్ పక్కన కూరగాయలు, కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకునే వ్యాపారులను పవన్ పలకరించారు. వారి వ్యాపారాలపై తుపాను ప్రభావం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలిచ్చారు.