ఏపీలో 16న జీఎస్టీ పండుగ: 10 కోట్లకు ఎసరు!
ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని కేంద్రాన్ని మోసేస్తోంది. వాస్తవానికి ఏపీలోని జనసేన, టీడీపీ పార్టీల అండతో కేంద్రంలో మోడీ చక్రం తిప్పుతున్నారు.;
ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని కేంద్రాన్ని మోసేస్తోంది. వాస్తవానికి ఏపీలోని జనసేన, టీడీపీ పార్టీల అండతో కేంద్రంలో మోడీ చక్రం తిప్పుతున్నారు. వీరి మద్దతుతోనే ఆయన మూడో సారి అధికారంలోకి వచ్చారు. దీంతో ఆయనే ఏపీలోని ఈ రెండు పార్టీలను మోయాల్సి ఉంది. కానీ, దీనికి భిన్నంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు .. అవసరం లేకున్నా.. అవసరం సృష్టించుకుని మరీ.. మోడీని, కేంద్రాన్ని కూడా మోసేస్తున్నారు. ఇటీవల జనసేనాని పవన్ కర్ణాటకలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీ. గోపాలగౌడ 75 వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొ న్నారు. అయితే.. పవన్ తన ప్రసంగంలో అవసరం లేకపోయినా.. గోపాల గౌడకు ప్రధాని మోడీకి పడక పోయినా.. మోడీని మాత్రం ఆకాశానికి ఎత్తేశారు. ఇక, ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన సమయంలో .. ఈ పథకంలో కేంద్రం పాత్ర కానీ.. ఊసుకానీ లేకపోయినా.. సీఎం చంద్రబాబు.. ఉద్దేశ పూర్వకంగానే మోడీని తలుచుకుని.. మెచ్చుకున్నారు.
ఇక, ఇప్పుడు అదే మోడీ కోసం.. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో చేయని విధంగా చంద్రబాబు, పవన్ ద్వయం.. 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జీఎస్టీ పండుగకు తెరదీశారు. దీనికి ఈ నెల 16న ముహూర్తం కూడా ఖరారు చేశారు. కర్నూలు వేదిగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దాదాపు 3-4 లక్షల మంది జన సమీకరణ చేయాలని, బస్సులు పెట్టాలని.. వచ్చే వారికి భోజనం, టీ, కాఫీ, మజ్జిగ, మంచినీళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక, వేదిక ఏర్పాట్లు, వాహనాల సౌకర్యం, హెలిప్యాడ్ల నిర్మాణం .. వంటివి కామన్. ఎక్కడా లోటు రావద్దని కూడా ఆదేశించారు.
అయితే.. ఇంతకీ ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే.. జీఎస్టీ-2.0 సంస్కరణల పేరుతో గత నెల 22 నుంచి కేంద్రం జీఎస్టీ శ్లాబులను సవరించింది. తద్వారా నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్, దుస్తులు, వాహనాల ధరలు దిగి వచ్చాయి. ఇవన్నీ పేదలకు మోడీ చేసిన మేలు అని.. దీంతో ప్రజల జీవితాలు పొదుపు బాట పడతాయని పేర్కొంటూ.. చంద్రబాబు, పవన్‌లు కలిసి.. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించారు. అయితే.. ఇప్పటి వరకు.. ఆయన అప్పాయింట్‌మెంటు ఖరారు కాలేదు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో వచ్చేదీ రాందీ స్పష్టత లేదు. కానీ, ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి.