బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి : పవన్ కళ్యాణ్ ఎటు వైపు ?
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మా చెడ్డ చిక్కు వచ్చిపడింది. అటు చూస్తే అన్నయ్య, ఇటు చూస్తే కూటమి దాంతో ఆయన అడ కత్తెరలో ఇరుక్కున్నట్లుగా ఉంది.;
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మా చెడ్డ చిక్కు వచ్చిపడింది. అటు చూస్తే అన్నయ్య, ఇటు చూస్తే కూటమి దాంతో ఆయన అడ కత్తెరలో ఇరుక్కున్నట్లుగా ఉంది. ఎందుకు ఇలా అంటే గురువారం నాడు అనూహ్యంగా అసెంబ్లీ వేదికగా జరిగిపోయిన పరిణామాలు అటూ ఇటూ తిరిగి మెగా బ్రదర్స్ కే చుట్టుకునేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొని చేసిన కామెంట్స్ ఆ మీదట అది తప్పు అంటూ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా రాజకీయంగా మంటనే పెట్టాయి. అంతే కాదు బాలయ్య జగన్ ని అంటున్నట్లుగానే అదే దూకుడులో చిరంజీవి మీద కూడా కామెంట్స్ చేశారు. దాంతో విషయం కాస్తా బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి గా మారింది.
జగన్ మీద అదే విమర్శ :
సినీ ప్రముఖులు తనను కలవడానికి వెళ్ళినపుడు జగన్ సీఎం హోదాలో వారిని అవమానించారు అన్నది గత మూడు నాలుగేళ్ళుగా ఏపీలో ఆనాటి విపక్షం ఈనాటి అధికార పక్షం అయిన కూటమి చేస్తున్న అతి పెద్ద ఆరోపణ. సినీ పెద్దగా మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి విషయంలో జగన్ అమర్యాదగా వ్యవహరించారు అన్నది తరచూ చేస్తున్న ఆరోపణ. వారూ వీరూ చేయడం కాదు ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ అనేక వేదిక మీద తన పార్టీ మీటింగులలోనూ చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న తన అన్న గారిని జగన్ రెండు చేతులు జోడించి దండం పెట్టించుకునేలా చేశారు అని పవన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. జగన్ ఇగోని సంతృప్తి చేసుకోవడం కోసం సినీ ప్రముఖులను పిలిపించుకుని ఆ విధంగా వ్యవహరిస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అలాంటిది ఏదీ జరగలేదని వైసీపీ నేతలు ఆనాడు ఖండించారు. కానీ కూటమి పెద్దలు మాత్రం ఇదే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. అయితే ఆనాడు చిరంజీవి నుంచి అసలు ఏమి జరిగింది అన్న దాని మీద వివరణ అయితే రాలేదు. దాంతో చిరంజీవికి అవమానం జరిగింది అని అంతా నమ్మారు కూడా.
కామినేని చేసింది అదే :
అనాడు జరిగింది సినీ ప్రముఖులకు అవమానం అన్నది అంతలా ప్రచారం జరగబట్టే బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా శాసనసభ వేదికగా గురువారం మరోసారి ఇదే విషయం ప్రస్తావించారు. చిరంజీవి వంటి వారిని ఎక్కడో ఆపేశారని, అంతే కాదు ముఖ్యమంత్రి మాట్లాడరని సినీ ఆటోగ్రాఫ్ మంత్రితోనే మాట్లాడుకోవాలని చెప్పారని కూడా కామినేని అన్నారు. అయితే ఈ పరిణామాల పట్ల ఆగ్రహించిన చిరంజీవి గట్టిగా మాట్లాడడంతోనే జగన్ చివరికి వచ్చి కలిశారు అని ఆయన చెప్పారు.
అనూహ్యంగా సీన్ లోకి బాలయ్య :
ఆ సమయంలో సభలో ఉన్న బాలయ్య అనూహ్యంగా ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన లేచి మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ చెప్పింది తప్పు అని ఖండించారు. చిరంజీవికి అవమానం జరిగింది అన్నది వాస్తవమే అని చెబుతూనే అక్కడ ఎవరూ గట్టిగా మాట్లాడింది అయితే లేదని చిరంజీవి మీద కూడా సెటైర్లు వేశారు. దాంతో ఈ ఇష్యూ కొత్త మలుపు తీసుకుంది. ఇక్కడ కూటమి కూడా ఒక విధంగా ఇరుకున పడింది అని అంటున్నారు.
క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ :
అపుడెపుడో అయిదేళ్ళ క్రితం అంటే 2020 ఆగస్టు సమయంలో జగన్ తో తాడేపల్లిలో జరిగిన మీటింగులో ఏమి జరిగింది అన్నది మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘమైన లేఖ ద్వారా వివరించారు. అంతే కాదు ఆయన తనకు ఎక్కడా అవమానం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. జగన్ తనను సాదరంగానే ఆహ్వానించారని చెప్పారు, ముందు ఆయన తనను ఇంటికి పిలిపి అన్ని విషయాలు చర్చించారు అని ఆ తరువాత పది మంది దాకా సినీ ప్రముఖులను కలిశామని చిరంజీవి నాటి సంఘటనను వివరించారు. ఆ సమయంలో సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ పరిష్కరించారని కూడా చెప్పారు. టికెట్ల రేట్ల పెంపు కూడా జరిగిందని అన్నారు.
పవన్ ఇరుకున పడ్డారా :
తన అన్నయ్య మెగాస్టార్ కి అవమానం జరిగిందని జగన్ పిలిచి మరీ ఆయనను ఇబ్బంది పెట్టారని గత అయిదేళ్ళుగా పవన్ చాలా చోట్ల ప్రచారం చేశారు. ఇపుడు అదే అన్నయ్య జగన్ సమాదరించారు అని ఎక్కడా తనకు అవమానం జరగలేదని చెప్పుకొచ్చారు. అంతే కాదు చిరంజీవి మరో మాట అన్నారు తాను సామాన్యుడి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎవరి దగ్గర అయినా గౌరవం ఇచ్చి పుచ్చుకుంటాను అని చెప్పారు. అంటే తాను జగన్ కి గౌరవం ఇచ్చాను అలాగే పుచ్చుకున్నాను అని చెప్పారు. మరి ఇష్యూ ఇంత క్లియర్ గా క్లారిటీగా చెప్పాక కూటమి వాదనతో పాటు పవన్ వాదన కూడా తేలిపోతున్న వేళ మెగాస్టార్ ఇచ్చిన ఈ వివరణకు పవన్ రియాక్షన్ ఏమిటి అన్నది ఇపుడు సర్వత్రా ఆసక్తిగా ఉంది.
బాలయ్య వాదన అదే :
సినీ ప్రముఖులను జగన్ అవమానించారు అన్నది బాలయ్య వాదన. అదే కూటమి వాదన కూడా. తేడా ఎక్కడ వచ్చింది అంటే చిరంజీవి గట్టిగా ఏమీ మాట్లాడలేదు అన్న దగ్గరే. ఆ పాయింట్ మీదనే మెగాస్టార్ రియాక్ట్ అయి మొత్తం సీన్ టూ సీన్ చెప్పేశారు. పవన్ అయితే తాను ఇంత కాలం చెప్పిన దాని ప్రకారం కానీ అలాగే కూటమి వాదన ప్రకారం చూస్తే బాలయ్య చెప్పినదే రైట్ అనాలి. ఎందుకంటే జగన్ అవమానించారు అని బలంగా చెబుతున్నది కూడా ఆయనే. అదే సమయంలో తన అన్న మీద బాలయ్య చేసిన సెటైరికల్ కామెంట్స్ ని ఆయన ఎలా అంగీకరించగలరు అన్నది మరో ప్రశ్న. నిజానికి చిరంజీవికి ఈ విషయంలోనే ఎక్కడో మండి మొత్తం మాటర్ చెప్పారని అంటున్నారు. పదే పదే సినీ ప్రముఖులను అవమానించారు అన్నది ఒక ఇష్యూగా చేయడంతో ఆయన చెప్పాల్సింది చెప్పేశారు.
నలుగుతున్నది మాత్రం ఆయనే :
ఇపుడు పవన్ తేల్చుకోవాల్సి ఉంది. తన అన్నను జగన్ అవమానించారు అన్న మాట మీద ఈ రోజుకీ నిలబడితే మాత్రం బాలయ్య చెప్పిందే కరెక్ట్ అని ఆయనకే సపొర్ట్ గా ఉండాలి. పైగా కూటమిలో కీలకంగా ఉంటూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కి ఇది అనివార్యం కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ ఈ రోజుకు ఈ రోజు నోరు విప్పేది ఉండదు కానీ ఈ ఇష్యూలో ఇరుకున పడింది నలుగుతున్నది మాత్రం ఆయనే అని అంటున్నారు. ఎందుకంటే తన అన్నకు అవమానం జరిగింది అని ఏపీ వ్యాప్తంగా చెబుతూ జగన్ మీద తీవ్ర విమర్శలు చేసిన పవన్ మాటలు కూడా చిరంజీవి ఇచ్చిన క్లారిటీతో తేలిపోయాయి కాబట్టి అని అంటున్నారు.