బాబు విజనరీ...వెనకబడిన ప్రాంతానికి భారీ ప్రాజెక్ట్

ఏపీ సీఎం చంద్రబాబుని అందరూ విజనరీ అని అందుకే అంటారు. ఆయన విజన్ తో చూస్తే మరో పాతికేళ్ళకు ముందే భవిష్యత్తు కనిపిస్తుంది.;

Update: 2025-06-27 08:39 GMT

ఏపీ సీఎం చంద్రబాబుని అందరూ విజనరీ అని అందుకే అంటారు. ఆయన విజన్ తో చూస్తే మరో పాతికేళ్ళకు ముందే భవిష్యత్తు కనిపిస్తుంది. విభజన తరువాత పరిశ్రమలు ఎక్కడా ఏపీలో లేవని కేవలం వ్యవసాయిక ఆధారిత రాష్ట్రమని అంతా నిట్టూర్చేవారు.

అయితే బాబు ఆలోచనతో తన పలుకుబడితో చాలా మంది బడా పారిశ్రామికవేత్తలను ఆకర్షించగలిగారు. ఈ క్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఒక భారీ పరిశ్రమను స్థాపించనుంది. అది కూడా ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన జిల్లాగా ఉన్న విజయనగరం జిల్లా కొత్తవలసలో.

ఈ భారీ పరిశ్రమ ఏర్పాటుకు పతంజలి సంస్థ వందల కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఈ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తవలస మండలంలోని చినరావుపల్లి గ్రామంలో 172 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భారీ ఆయుర్వేద పరిశ్రమ స్థాపనతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు.

అంతే కాదు ఉత్తరాంధ్రలో భారీ జాతీయ ఆయుర్వేద పరిశ్రమ ఏర్పాటు అంటే ఈ ప్రాంతం కూడా ప్రముఖంగా మారుమోగే అవకాశాలు ఉన్నాయి. ఇక విభజనకు ముందు ఉమ్మడి ఏపీలోనూ విభజన తరువాత ఏపీలోనూ భారీ పరిశ్రమలు ఏవీ విజయనగరం ప్రాంతానికి దక్కలేదు అన్న ఆవేదన అయితే స్థానికంగా ఉంది.

ఇపుడు ఆ లోటుని తీర్చే విధంగా చంద్రబాబు విజయనగరానికే ఈ ఆయుర్వేద పరిశ్రమను కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మరో వైపు చూస్తే యోగా గురువు బాగా రాందేవ్ తాను స్థాపించబోయే పరిశ్రమకు సంబంధించిన స్థలాన్ని చూసేందుకు కొత్తవలస వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబుని ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు విజనరీ అని కొనియాడారు. బాబు దూర దృష్టి కలిగిన నాయకుడు అన్నారు. ఆయన సహాయ సహకారాల వల్లనే ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి ఈ ప్రాజెక్ట్ ని తాను ముందుకు తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే ఆయుర్వేద రంగానికి మళ్ళీ పాత రోజులు ప్రాభవం వస్తున్న నేపథ్యంలో ఒక జాతీయ స్థాయి భారీ పరిశ్రమ స్థానికంగా ఏర్పాటుతో విజయనగరం జిల్లా రూపు రేఖలు సమూలంగా మారిపోతాయని అంటున్నారు. అంతే కాదు రానున్న రోజులలో ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు స్థానికులకు దక్కుతాయని అంటున్నారు. ఏది ఏమైనా బాబు బాగా ఇద్దరూ కలసి వెనకబడిన ప్రాంతానికి ఎనలేని మేలు చేస్తున్నారు అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News