పార్లమెంట్ : ప్రత్యేక సమావేశం అజెండా ఇదేనా ?

ఇండియాకూటమి అంచనా ప్రకారం ఐదు అంశాలపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరిగే అవకాశముంది.

Update: 2023-09-08 05:15 GMT

ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సెషన్ జరగబోతోంది. ప్రత్యేక సెషన్ గురించి నరేంద్రమోడీ ప్రభుత్వం సడెన్ గా ప్రకటించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రత్యేక సెషన్లు నడవలేదు కాబట్టి ప్రతిపక్షాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ సెషన్ ఎన్నిరోజులు జరుగుతుందో ప్రకటించిన ప్రభుత్వం అజెండా ఏమిటో మాత్రం ప్రకటించలేదు. మామూలుగా అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని ప్రకటించినపుడే సమావేశాల్లో చర్చించబోయే అంశాలపై అనధికారికంగా సమాచారం వచ్చేస్తుంది.

అయితే తొందరలో జరగబోయే ప్రత్యేక సమావేశాల అజెండా మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే అందుబాటులోని సమాచారం, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాకూటమి అంచనా ప్రకారం ఐదు అంశాలపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరిగే అవకాశముంది.

ఇంతకీ ఆ ఐదు అంశాలు ఏవంటే రోహిణీ కమీషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఓబీసీ వర్గీకరణ బిల్లు, ఇండియా పేరును భారత్ గా మార్చటం, వన్ నేషన్ వన్ ఎలక్షన్, యూనిఫాం సివిల్ కోడ్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు పై ప్రత్యేక చర్చలుంటాయని అనుకుంటున్నారు.

Read more!

ఇండియాకూటమితో పాటు ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలంటే మోడీ తనదైన చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకనే పైన చెప్పిన ఐదు అంశాల్లో కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్, యూనిఫాం సివిల్ కోడ్, ఇండియా పేరును భారత్ గా మార్చటం అనే అంశాలు చాలా కీలకమైనవి.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది అన్నీ పార్టీలకు ఇబ్బంది కలిగించేదే అనటంలో సందేహంలేదు. చాలా దశాబ్దాల తర్వాత ఆచరణలోకి రాబోతున్న జమిలి ఎన్నికల ఈ ప్రక్రియతో తమకు లాభం జరుగుతుందని మోడీ అనుకుంటున్నారు. ఆచరణలోకి రాబోతోందంటే అర్ధం బిల్లు పాసైపోతే చాలు ఆచరణలోకి వచ్చేస్తుందని అనుకోవచ్చు.

అయితే బిల్లు పాసవ్వటంలో చాలా కష్టాలున్నాయి. మరి వాటిని మోడీ ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఇక ఓబీసీ వర్గీకరణ అంశం కూడా కీలకమైనదే అయినా పైన చెప్పిన మూడు అంశాలంత కాకపోవచ్చు. మరి ప్రత్యేక సమావేశాల్లో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News