అమెరికా స్కూల్లో పిల్లల తల్లులు పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు!
అనుకుంటాం కానీ అమెరికా అద్భుతం.. అదీ అని. కానీ.. అక్కడా ఉండేది మనుషులే. మన మాదిరే వారూ ఉంటారు.;
అనుకుంటాం కానీ అమెరికా అద్భుతం.. అదీ అని. కానీ.. అక్కడా ఉండేది మనుషులే. మన మాదిరే వారూ ఉంటారు. బలమైన ఆర్థిక మూలాలు మాత్రమే ఆ దేశానికి వరం. ఆ మాటకు వస్తే.. మన లాంటి దేశంలో కూడా కనిపించని దరిద్రపు ఘటనలు ఆ దేశంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. నిబంధనల్ని పక్కాగా ఫాలో అవుతారని చెప్పినా.. ఆ మాటల్లో ఏ మాత్రం నిజం లేదన్న విషయం కొన్ని ఉదంతాల్ని చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది.
ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకు చెందిందే. అమెరికాలోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థుల తల్లుల మధ్య జరిగిన రభస అంతా ఇంతా కాదు. వాదనలతో మొదలై.. ముష్ఠిఘాతాల వరకు వెళ్లిన వైనం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారి ఇప్పుడు హాట్ చర్చగా మారింది. పిల్లల తల్లులు కొట్టేసుకుంటున్న ఈ ఎపిసోడ్ లో విద్యార్థులు విపరీతమైన భయాందోళనలకు గురి కావటమే కాదు.. అలా కొట్టుకోవద్దంటూ బతిమిలాడిన వైనం చూసినప్పుడు.. నాగరిక ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్ అంటూ బడాయి కబుర్లు చెప్పే అమెరికా అసలు ముచ్చట ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.
యూఎస్ లోని ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని వెస్ట్ మెంఫిస్ నగరంలో ఫాల్కీ ఎలిమెంటరీ అనే స్కూల్ ఉంది. మే 28న ఆ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకల్ని నిర్వహించారు. చిన్నారులు.. వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉల్లాసంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో కొందరు మహిళల మధ్య ఏదో అంశంపై గొడవ మొదలైంది. అది కాస్తా తీవ్రమైన వాగ్వాదానికి కారణమైంది. చివరకు ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు విసురుకునే వరకు విషయం వెళ్లింది.
వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన ఇద్దరు తండ్రులు సైతం కొట్టుకునే వరకు విషయం వెళ్లింది. దీంతో.. ఈ రచ్చతో స్కూల్ ప్రాంగణమంతా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పిల్లలు.. తమ తల్లుల్ని కొట్టుకోవద్దంటూ వేడుకుంటున్నా.. వారు మాత్రం పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు విసురుకోవటంలోనే బిజీ అయ్యారు తప్పించి.. వెనక్కి తగ్గలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ ఘటనను స్కూల్ మేనేజ్ మెంట్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని..ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థులు.. సిబ్బంది రక్షణ.. స్కూల్ ప్రాంగణం భద్రత తమకు ప్రాధాన్యమని.. ఈ విషయంలో పోలీసులు జరిపే దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని చెప్పింది. ఏమైనా.. ఒక స్కూల్లో విద్యార్థుల తల్లుల మధ్య గొడవ జరగటం ఏమిటి? పొట్టు పొట్టుగా కొట్టుకోవటం ఏమిటి? అంటూ వీడియో చూసినోళ్లంతా అవాక్కు అవువుతున్న పరిస్థితి.