హాట్ టాపిక్ గా ఆ ఐఏఎస్ మూడో పెళ్లి.. భార్య కూడా ఐఏఎస్సే!

చట్టప్రకారం విడాకులు తీసుకొని పెళ్లి చేసుకోవటం చట్టవిరుద్ధమైన చర్య కాదు. కాకుంటే.. ఐఏఎస్ అధికారిగా ఉంటూ మూడో పెళ్లి చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2026-02-17 08:07 GMT

ఇద్దరు ఐఏఎస్ లు పెళ్లి చేసుకోవటం కామన్. కానీ.. ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారుల వివాహం దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఎందుకంటే.. ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్ కు ఇది మూడో పెళ్లి అయితే.. పెళ్లికుమార్తె అయిన అంకితా ధాక్రేకు ఇది మొదటిపెళ్లి కావటమే. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య సింఫుల్ గా.. కునో నేషనల్ పార్కులో జరిగింది. వీరిద్దరూ మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన వారే.

2014 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్.. ఉత్తరప్రదేశ్ కు చెందిన సీతాపూర్ ప్రాంతానికి చెందిన వారు. ఆయన 2014లో జరిగిన యూపీఎస్ సీ పరీక్షలో ఆలిండియాలో 13వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ కావటానికి ముందు భారత రిజర్వు బ్యాంకులో పని చేశారు. మధ్యప్రదేశ్ లోని కట్నీ జిల్లా కలెక్టర్ గా పని చేసిన సమయంలో చిన్నారుల పోషకాహార లోపాన్ని నివారించేందుకు చేపట్టిన చర్యలు ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. గతంలో ఆయన చేసుకున్న రెండు పెళ్లిళ్లు లవ్ మ్యారేజీలే. అయితే.. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాతే ఆయన మూడో పెళ్లి చేసుకున్నారు.

చట్టప్రకారం విడాకులు తీసుకొని పెళ్లి చేసుకోవటం చట్టవిరుద్ధమైన చర్య కాదు. కాకుంటే.. ఐఏఎస్ అధికారిగా ఉంటూ మూడో పెళ్లి చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ఐఏఎస్ వర్గాల్లోనూ ఇదో చర్చనీయాంశంగా మారిందని చెబుతున్నారు. ఇక.. ఆయన గతంలో చేసుకున్న రెండు పెళ్లిళ్లు కూడా ఐఏఎస్ అధికారిణులే కావటం విశేషం. మొదటి భార్య రిజు బఫ్నా కూడా 2014 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకునే సమయంలో వారిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారి.. ఆపై పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో విడిపోయారు. విడాకులు తీసుకున్నారు.

అనంతరం 2016 బ్యాచ్ కు ఐఏఎస్ అధికారి మిషా సింగ్ ను పెళ్లాడారు. వీరిద్దరూ సర్వీసులో ఉండగా పరిచయమై.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. మిషా సింగ్ కు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉంది. ఆమె ఏపీ క్యాడర్. అయితే.. పెళ్లి తర్వాత ఆమె తన కేడర్ ను మధ్యప్రదేశ్ కు మార్చుకున్నారు. వీరి వైవాహిక బంధం నాలుగేళ్లు సాగినట్లుగా చెబుతున్నారు. అనంతరం వీరు విడిపోయారు. ప్రసాద్ మాజీ భార్యలు ఇద్దరు మధ్యప్రదేశ్ లోని రెండు జిల్లాలకు కలెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

ఐఏఎస్ ప్రసాద్ మూడో పెళ్లి సోషల్ మీడియాలోనే కాదు.. ప్రధాన మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది. అయితే.. ఆయన మాజీ భార్యలు ఎప్పుడూ ప్రసాద్ మీద ఎలాంటి విమర్శలు.. ఆరోపణలు చేయకపోవట గమనార్హం. అయితే.. ఇద్దరి భార్యలతో ఆయనకు ఏమైనా సంతానం ఉందా? అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. 2017 బ్యాచ్ కు చెందిన అంకితా ధాక్రే మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ కు చెందిన వారు. ఆమె తండ్రి రిటైర్డ్ ఫుడ్ ఆఫీసర్ గా చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె తాను పని చేసిన చోట్ల కఠినంగా ఉంటారని.. ఎలాంటి తప్పులు చేయరని.. నిజాయితీ అధికారిణిగా పేరుంది.

Tags:    

Similar News