గెలుపు కోసం కోట్లు ఖర్చు.. మేయర్ కుర్చీ సొంతమైతే జీతమెంత?
తెలంగాణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడటం.. మేయర్ పోస్టుకు ఎన్నిక జరగటం తెలిసిందే.;
తెలంగాణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడటం.. మేయర్ పోస్టుకు ఎన్నిక జరగటం తెలిసిందే. ఏడు నగర పాలక సంస్థలు.. 105 మున్సిపాలిటీలకు ప్రథమ పౌరులు ఎవరన్నది సోమవారం డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. కొర్పరేషన్లలో మేయర్, ఉప మేయర్.. అదే మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు జరిగి తమ పాలకుల్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. మేయర్, మున్సిపల్ ఛైర్మన్లకు ఉండే గౌరవమర్యాదలు ఎంతంటే.. చివరకు దేశ ప్రధాని సైతం వారి మున్సిపాలిటీలకు వస్తే.. ప్రోటోకాల్ లో వారు మొదటి స్థానంలో ఉంటారు. ఎన్నికైన తేదీ నుంచి ఐదేళ్ల పాటు వారి పదవీ కాలం ఉంటుంది.
ఎన్నికల్లో గెలుపు కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టినోళ్లు కూడా ఉన్నారు. తొలుత వార్డుల్లో గెలిచి.. ఆ తర్వాత వార్డుల్లో గెలిచిన వారి మెజార్టీ నిర్ణయంతో మేయర్/మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకోవటం తెలిసిందే. మరి.. ఈ పోస్టులకు జీతభత్యాల మాటేమిటి? అన్న ప్రశ్న మదిలో మెదలొచ్చు. కానీ.. ఆ లెక్క తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకుంటే.. అంత భారీగా ఖర్చు చేసి.. ఈ మాత్రం జీతానికి ఇంత కష్టపడ్డారా? అని అనుకోవచ్చు. అదే.. అసలుసిసలు రాజకీయమంటే.
మేయర్ కు జీతాలు.. వాహన భత్యాలు ఉంటాయి. సిబ్బంది సేవల్ని వినియోగించుకునే వీలుంది. అదే పురపాలక ఛైర్ పర్సన్లకు వేతనాలు ఉంటాయి. ఆ లెక్కలోకి వెళితే.. 50 వేల జనాభా దాటిన మున్సిపాలిటీల్లో ఛైర్మన్ కు నెలకు రూ.19,500, అదే డిప్యూటీ ఛైర్ పర్సన్లకు రూ.9750, కౌన్సెలర్లకు రూ.4550 చొప్పున వేతనాలు ఉంటాయి. ఇదంతా నెలకు అందే జీతాల లెక్క. అదే కార్పొరేషన్ మేయర్ కు అయితే నెలకు రూ.65 వేల జీతం, డిప్యూటీ మేయర్కు రూ.32,500.. కార్పొరేటర్ కు రూ.7800 చొప్పున జీతాలు ఉంటాయి.
తెలంగాణ రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్ పర్సన్, డిప్యూటీ ఛైర్ పర్సన్ లు తాము పదవి చేపట్టిన మొదటి నాలుగు సంవత్సరాల వరకు వారిపై ఎలాంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టటానికి వీల్లేదు. నాలుగేళ్ల తర్వాత మొత్తం ఓటుహక్కు ఉన్న సభ్యుల్లో సగం మంది సంతకాలు చేసి.. నోటీసులు ఇచ్చి మూడు వంతుల్లో రెండు వంతుల మెజార్టీ తీర్మానాన్ని ఆమోదిస్తే వారిని పదవి నుంచి తొలగించే వీలుంది. ఇదండి.. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి గెలిచిన తర్వాత అందే జీతభత్యాలు.