ఇజ్రాయెల్, అమెరికాకు షాక్.. పాలస్తీనా దేశానికి బ్రిటన్ గుర్తింపు
ఇక పాలస్తీనా అనేది 80 ఏళ్ల కిందటి వరకు ఒక ప్రత్యేక దేశమే. 1988లోనే పాలస్తీనాను భారత్ కూడా గుర్తించింది.;
ప్రపంచంలో మొత్తం ఉన్న దేశాల సంఖ్య ఎంత..? ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి (యూఎన్) ప్రకారం అయితే 195. మరో మూడు అబ్జర్వర్ కంట్రీస్ (పరిశీలక దేశాలు). ఆ మూడు పాలస్తీనా, వాటికన్ సిటీ, కొసావో. వీటిలో వాటికన్ అనేది క్రైస్తవ మత పెద్ద పోప్ నివసించే నగరం. ఇక పాలస్తీనా అనేది 80 ఏళ్ల కిందటి వరకు ఒక ప్రత్యేక దేశమే. 1988లోనే పాలస్తీనాను భారత్ కూడా గుర్తించింది. అప్పట్లో ఈ గుర్తింపు ఇచ్చిన తొలి దేశాలలో మనదీ ఒకటి. ఇటీవల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాకు సంపూర్ణ దేశ హోదా కల్పించే తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది కూడా.
ట్రంప్ కు షాక్ ఇస్తూ...
వాటికన్ తో పాటు ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం పాలస్తీనా సభ్య దేశం కాని పరిశీలక దేశం. ఈ హోదాను సమితి సాధారణ సభ ఇస్తుంది. ఇక తాజాగా పాలస్తీనాను బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా కూడా ఒక దేశంగా గుర్తించాయి. త్వరలో ఫ్రాన్స్ సహా మరికొన్ని దేశాలు ఇదే నిర్ణయం తీసుకోనున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే.. ఈ దేశాలన్నీ అమెరికాకు ఒకప్పుడు మిత్ర దేశాలు. అయితే, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక యూరప్ దేశాలనూ వదలకుండా టారిఫ్ లు బాదేస్తున్నారు. పలు విషయాల్లో వాటిని వేధిస్తున్నారు. దీంతో ఆయనకు షాక్ ఇస్తూ పాలస్తీనాను దేశంగా గుర్తించాయి.
అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా..
బ్రిటన్ అంటే అమెరికా సోదరుడు అనుకోవాలి. అంతటి మిత్ర దేశం ఇప్పుడు అమెరికా నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నా లెక్క చేయకుండా పాలస్తీనాను దేశం గుర్తిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనికి ఇజ్రాయెల్, అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పట్టించుకోలేదు. హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని 2023 నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. అయితే, అక్కడ అమాయక ప్రజలు బలవుతూ తీవ్రస్థాయి మానవతా సంక్షోభం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గాజాలో కాల్పుల విరమణ పాటించాలని, ఐక్యరాజ్య సమితి సాయం అందేలా చూడాలని, దీర్ఘకాల శాంతికి అంగీకరించాలని ఇజ్రాయెల్ ను బ్రిటన్ కోరుతోంది. దీనికి ఒప్పుకోకుంటే పాలస్తీనాను దేశం గుర్తిస్తామని జూలైలోనే స్టార్మర్ స్పష్టం చేశారు. ట్రంప్ ఇటీవల బ్రిటన్ వెళ్లిన సందర్భంలో ఈ ఆలోచనను వ్యతిరేకించారు. కానీ, స్టార్మర్ మాత్రం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ లో శాంతిని పునరుద్ధరించేందుకు, రెండు దేశాల దేశ పరిష్కారానికి ఈ చర్య చేపట్టినట్లుగా తెలిపారు.
రెండు దేశాల పరిష్కారం అంటే?
ద్విదేశ (రెండు దేశాల) పరిష్కారం అంటే... పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండూ అని అర్ధం. భారత్ ఇప్పటికే దీనికి మద్దతు తెలిపింది. ఒకప్పటి వలస దేశాల రాజు అయిన బ్రిటన్ కూడా ఒప్పుకోవడం కీలక పరిణామం.