ఉగ్రవాదులను పట్టుకునే బాధ్యత పాకిస్తాన్‌కా? ఐరాస నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యం!
ప్రపంచంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిలయంగా భావిస్తున్న దేశం ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే కమిటీలకు నాయకత్వం వహించడం విచిత్రంగా ఉంది.;
ప్రపంచంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిలయంగా భావిస్తున్న దేశం ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే కమిటీలకు నాయకత్వం వహించడం విచిత్రంగా ఉంది. ఇది నిజంగానే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని చాలా మంది విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా మండలిలోని ఉగ్రవాద వ్యతిరేక కమిటీకి పాకిస్తాన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడంతో పాటు, తాలిబన్ ఆంక్షల కమిటీ పగ్గాలు కూడా ఆ దేశానికి దక్కడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఉగ్రవాద నిరోధక బాధ్యతల్లో పాకిస్తాన్ పాత్ర
అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్, లష్కర్-ఎ-తైబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఐరాస ఉగ్రవాద జాబితాలో ఉన్న 850 మంది వ్యక్తులు, సంస్థలలో 146 పాకిస్తాన్‌కు చెందినవారే. అలాంటి దేశానికి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే కమిటీల్లో కీలక స్థానాలు లభించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. భవిష్యత్తులో పాకిస్తాన్ ఈ పదవులను ఉపయోగించుకుని, నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులను తొలగించడానికి ప్రయత్నిస్తుందని, అలాగే భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేసే సంస్థలకు మద్దతు ఇస్తుందని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాకిస్తాన్ నలుగురు హిందువులను ఉగ్రవాదులుగా ప్రకటించాలని ప్రయత్నించగా, ఇతర దేశాలు దాని కుట్రను గ్రహించి తిరస్కరించాయి. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు మళ్లీ జరిగే అవకాశం ఉంది.
తాలిబన్ ఆంక్షల కమిటీ
తాలిబన్ ఆంక్షల కమిటీకి పాకిస్తాన్ అధిపతిగా ఉండటం ఆ దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కీలకమని విశ్లేషకులు అంటున్నారు. ఈ కమిటీకి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ల ఆస్తులను జప్తు చేయడం, ఆయుధాల నిషేధం విధించడం, ఉగ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకున్న తాలిబన్‌లను నిషేధిత జాబితాలో చేర్చడం వంటి అధికారాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆంక్షల పరిధి నుంచి ఎవరినైనా చేర్చడానికి లేదా తొలగించడానికి కూడా ఈ కమిటీకి అధికారం ఉంది. ఇది పాకిస్తాన్‌కు వ్యూహాత్మక ప్రయోజనాలను చేకూర్చవచ్చు.
ఇస్లామాబాద్‌కు ప్రస్తుతం తాలిబన్‌లతో అంతగా సంబంధాలు లేవు. ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి దగ్గరవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఈ కమిటీ అధ్యక్ష స్థానాన్ని ఉపయోగించుకొని కాబూల్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తుంది.
భారత్‌పై కోపంతో పాకిస్తాన్ కొత్త వ్యూహాలు?
పహల్గామ్ దాడి విషయంలో తాలిబన్‌లు పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా, ఆపరేషన్ సిందూర్‌ను బూచిగా చూపి, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేస్తుందని పాకిస్తాన్ చేసిన ప్రచారాన్ని కూడా వారు బహిరంగంగా ఖండించారు. ఇటీవల, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకీతో మాట్లాడటం పాకిస్తాన్‌కు మింగుడు పడలేదు. అప్పటి నుండి, అది తాలిబన్‌లతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులు బీజింగ్‌లో సమావేశమయ్యారు. కాబూల్‌ను చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌లో చేర్చడంపై చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ల ఆంక్షల కమిటీకి పాకిస్తాన్ అధిపతిగా ఎన్నిక కావడం ఒక కీలక పరిణామం. ఇది అంతర్జాతీయంగా భారత్‌కు కొత్త సవాళ్లను సృష్టించే అవకాశం ఉంది.