పచ్చ కామెర్ల పాక్ కు అన్నీ పచ్చగానే కనిపిస్తాయి.. భారత్ పై ఆరోపణలు!

అవును... పాకిస్థాన్‌ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లో శనివారం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-29 05:29 GMT

పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంటుంది అనేది సామెత! ఈ క్రమంలో ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ.. భారత్ పై కక్షగడుతూ.. ఇక్కడ ఎలాంటి దాడులు చేయాలి, ఎక్కడెక్కడ బాంబులు పేల్చాలి.. ఆత్మాహుతి దాడులు ఎలా ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తుంటుంది పాక్. అయితే... భారత్ కూడా అదే స్థాయిలో ఆలొచిస్తుంటుందంటూ బురదజల్లే పనికి పూనుకుంది.

అవును... పాకిస్థాన్‌ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లో శనివారం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పౌరులు, ప్రభుత్వ అధికారులు సహా 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు ఆ దేశ సైనికాధికారులు ప్రకటించారు.

అయితే... ఈ దాడి వెనుక భారతదేశం హస్తం ఉందంటూ పాకిస్థాన్ సైన్యం ఆరోపించడం మొదలుపెట్టింది. దీంతో... పాకిస్థాన్ సైన్యం చేసిన ఈ అర్ధరహిత ఆరోపణలను న్యూఢిల్లీ తీవ్రంగా ఖండించింది. అవన్నీ పూర్తిగా తప్పుడు ఆరోపణలని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటనలో... ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భారత్‌ పై నిందలు వేస్తూ పాకిస్థాన్ సైన్యం చేసిన అధికారిక ప్రకటన తమ దృష్టికి వచ్చిందని తెలిపిన విదేశాంగ శాఖ.. ఈ ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది.

కాగా... పేలుడు పదార్థాలున్న వాహనంతో ఓ ఉగ్రవాది సైనిక కాన్వాయ్‌ పైకి దూసుకెళ్లడంతో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది పాకిస్థాన్ సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు పిల్లలు గాయపడ్డారు!

మొత్తంగా.. పౌరులు, ప్రభుత్వాధికారులతో సహా 24 మందికి తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు. అయితే... పాకిస్థాన్‌ లోని తాలిబన్‌ హఫీజ్‌ గుల్‌ బహదూర్‌ గ్రూపునకు చెందిన ఉసూద్‌-అల్‌-హర్బ్‌ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. అసలు విషయం ఇదైతే.. పాక్ సైన్యం మాత్రం భారత్ పై బుద్రదజల్లి, వారి కామెర్లు భారత్ కు ఉన్నాయని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది!

Tags:    

Similar News