ఉగ్ర శిబిరాలకు పాక్ మళ్లీ జీవం.. ఆపరేషన్ సింధూర్ 2కు భారత్ రె'ఢీ'

పాకిస్థాన్ తన బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారత్ ఎన్ని హెచ్చరికలు చేసినా ఖాతరు చేయకుండా ఉగ్రవాద మౌలిక వసతుల పునర్నిర్మాణానికి తెగబడుతోంది.

Update: 2026-08-23 19:30 GMT

పాకిస్థాన్ తన బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారత్ ఎన్ని హెచ్చరికలు చేసినా ఖాతరు చేయకుండా ఉగ్రవాద మౌలిక వసతుల పునర్నిర్మాణానికి తెగబడుతోంది. గతేడాది పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో ధ్వంసమైన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రధాన స్థావరాన్ని పాక్ తిరిగి నిర్మించినట్లు తాజాగా ఆధారాలు బయటపడ్డాయి.

‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యం

2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సరిహద్దు ఆవల ఉన్న ఉగ్ర నెట్‌వర్కే కారణమని స్పష్టం కావడంతో భారత సైన్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలోని కీలక ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో సర్జికల్ దాడులు నిర్వహించి పలు కాంప్లెక్స్‌లను నేలమట్టం చేసింది.

బహావల్‌పూర్ స్థావరం పునర్నిర్మాణం

ఈ దాడుల్లో ధ్వంసమైన వాటిలో పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రం ‘మార్కజ్ సుభానల్లా’ కాంప్లెక్స్ కూడా ఉంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోల ఆధారంగా ఈ కాంప్లెక్స్‌ను పాక్ ప్రభుత్వం దాదాపు పూర్తయ్యేలా పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. దెబ్బతిన్న ఇన్నర్ సెంట్రల్ హాల్‌కు కొత్త పెయింటింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఆధునిక సదుపాయాలతో కేవలం 15 నెలల్లోనే మళ్లీ సిద్ధం చేయడం గమనార్హం.

రూ.25 కోట్ల నిధులు.. ప్రభుత్వ ప్రోత్సాహం?

ఆపరేషన్ సింధూర్ అనంతరం జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి భారీగా ఆర్థిక సాయం అందిందనే వార్తలు వెలువడుతున్నాయి. మొత్తం రూ. 25 కోట్ల నిధులు ఆ సంస్థకు చేరగా అందులో సుమారు రూ. 11 కోట్లను కేవలం బహావల్‌పూర్ కాంప్లెక్స్ పునర్నిర్మాణానికే వెచ్చించినట్లు సమాచారం. ప్రస్తుతం జైషే చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజర్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో అతని సోదరులు తల్హా అల్ సైఫ్, అమ్మార్ అల్‌వీలు ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

భారత్ కఠిన హెచ్చరిక

సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని మళ్లీ ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ కూడా దేశ భద్రత విషయంలో ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ చర్యలు సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ఒకవేళ సరిహద్దు ఆవల ఉగ్ర శిబిరాల పునర్నిర్మాణం పూర్తయితే భారత్ ఎలాంటి వ్యూహాత్మక సైనిక చర్యకు పూనుకుంటుందనేది అత్యంత ప్రాధాన్యంగా మారింది.

Tags:    

Similar News