భాగ్యనగరంలో ఆటోలు 'బంద్'.. ఇక ప్రయాణికులారా.. మీ కాళ్లే మీకు మహాదేవా
హైదరాబాద్ లో ఆటో ఎక్కడమంటేనే అదొక పెద్ద సాహస యాత్ర. "రైట్.. పదండి" అని పిలవగానే మన దిశ కంటే ముందు వాళ్ళ సొంత రూట్.. చార్జీల లెక్కింపులే ముఖ్యం.
హైదరాబాద్ లో ఆటో ఎక్కడమంటేనే అదొక పెద్ద సాహస యాత్ర. "రైట్.. పదండి" అని పిలవగానే మన దిశ కంటే ముందు వాళ్ళ సొంత రూట్.. చార్జీల లెక్కింపులే ముఖ్యం. అలాంటిది ఇప్పుడు ఏకంగా 'ఆటోల బంద్' అంటూ నగరవాసులకు సుప్రభాతం పలికేందుకు సిద్ధమయ్యారు మన ఆటో అన్నలు. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఈ సమర శంఖారావం పూరించడంతో సోమవారం ఉదయం ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే వారికి పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయం.
డిమాండ్ల లిస్ట్ చాలా పెద్దదే బాస్!
ఆటో యూనియన్ల బాధలు వింటే అయ్యో అనిపిస్తుంది.. కానీ డిమాండ్లు చూస్తే అబ్బో అనిపిస్తుంది. పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయట.. మరి ఆటో చార్జీలు మాత్రం పాతకాలం నాటి మీటర్ల దగ్గరే ఆగిపోయాయట. అందుకే చార్జీలు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు. డ్రైవర్ల కోసం సపరేట్‌గా ఒక సంక్షేమ బోర్డు పెట్టాలి. దాంతో పాటు ఏటా డోకా లేకుండా రూ.12 వేల ఆర్థిక సాయం ఖాతాలో పడాలట. సిగ్నల్ జంపింగ్‌లు, రోడ్డు మధ్యలో ఆపడాలు మా నైజం.. కానీ ఆ ఈ-చలానాలు మాత్రం మమ్మల్ని క్షమించేయాలి అంటున్నారు. నగరంలో రాజభోగం వెలగబెడుతున్న అనధికారిక బైక్ ట్యాక్సీలను ఊడగొట్టాలి. బయటి జిల్లాల ఆటోలను నగర సరిహద్దుల్లోనే ఆపేయాలని ఆటో భాయిల హుకూం..
ప్రభుత్వం వర్సెస్ ఆటో యూనియన్లు: టీ-కప్పులో తుఫాను
ఇక మన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రంగంలోకి దిగి, "దయచేసి సమ్మె ఉపసంహరించుకోండి.. మీకోసం సంక్షేమ బోర్డు తెస్తాం.. పాత ఆటోలను మార్చుకుంటే రూ.1.5 లక్షల సాయం ఇస్తాం.. చార్జీల పెంపుపై కమిటీ వేస్తాం" అని వరుస ఆఫర్లు ప్రకటించారు. కానీ ఆటో సంఘాలు మాత్రం "మాకు కమిటీల బిస్కెట్లు వద్దు.. ప్రత్యక్ష పరిష్కారాలే ముద్దు" అంటూ సమ్మె బాటలోనే కదం తొక్కుతున్నాయి.
ప్రయాణికులకు దారేది?
ఇక అసలు సిసలైన కామెడీ, ట్రాజెడీ మన ప్రయాణికులదే. సోమవారం ఉదయం మెట్రో రైళ్లలో కాలు పెట్టేందుకు చోటు దొరకక 'సర్కస్' విన్యాసాలు చేయాల్సిందే. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ దెబ్బకు రద్దీ ఆల్రెడీ పీక్స్‌లో ఉంటే ఇప్పుడు ఆటోలు కూడా బంద్ అయితే పరిస్థితి 'హౌస్‌ఫుల్' కాదు 'హౌస్ బ్లాస్ట్' ఇక సొంత బండి ఉంటే ఓకే.. లేదంటే కాళ్లకు పని చెప్పడమో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ కోసం బాస్‌ను వేడుకోవడమో ఒక్కటే ప్రయాణికులకు మిగిలిన ఏకైక మార్గం..