అమెరికాలో టెక్సాస్ తెలుగు విద్యార్థి మృతి: ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగ అన్వేషణే కారణమా?
అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ ఘటన ఒక రకమైన హెచ్చరిక సంకేతంగా మారుతోంది.
ఉన్నత విద్యను అభ్యసించి.. మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవాలనే కలలతో అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు ప్రస్తుత పరిస్థితులు తీవ్ర సవాలుగా మారుతున్నాయి. ఉద్యోగ అవకాశాల్లో తీవ్రమైన అనిశ్చితి, నిత్యం పెరుగుతున్న జీవన వ్యయం, కఠినతరమవుతున్న ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో పాటు ఆర్థిక ఒత్తిళ్లు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన తెలుగు విద్యార్థి సాయి ప్రదీప్ ముస్తి టెక్సాస్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ప్రవాస వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఉద్యోగ వేటలో మానసిక వేదన
సాయి ప్రదీప్ ముస్తి టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోలో నివసిస్తూ తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఆయన లింక్డిన్ ప్రొఫైల్ వివరాల ప్రకారం.. 'అండర్ సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్' నుండి విద్యను అభ్యసించడమే కాకుండా సప్లై చైన్ అనలిస్ట్‌గా సుమారు ఐదేళ్లపాటు సుదీర్ఘ వృత్తిపరమైన అనుభవం కూడా ఉంది. అర్హతలతో పాటు తగిన అనుభవం ఉన్నప్పటికీ చదువు పూర్తయిన తర్వాత సరైన ఉద్యోగం లభించకపోవడం ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది.
భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి, నిరుద్యోగం, పెరుగుతున్న ఆర్థిక భారం తదితర పరిణామాలు సాయి ప్రదీప్‌ను తీవ్ర మానసిక ఒత్తిడికి, డిప్రెషన్‌కు గురిచేసినట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు నివేదిక లేదా కుటుంబ సభ్యుల ప్రకటన అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
భౌతికకాయం తరలింపునకు సహాయం
ఈ ఘోర వార్త తెలంగాణలోని ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం సాయి ప్రదీప్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడంతో పాటు అంత్యక్రియల వ్యయం కోసం నిధులు అవసరమవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు ఫండ్‌రైజర్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు.
విద్యార్థులకు హెచ్చరిక సంకేతం
అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ ఘటన ఒక రకమైన హెచ్చరిక సంకేతంగా మారుతోంది. విదేశాల్లో విద్య నభ్యసించే సమయంలో ఎదురయ్యే ఆర్థిక, వీసా సమస్యలతో పాటు ఒంటరితనం విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విదేశాల్లో ఉన్నప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా కౌన్సెలర్లతో మాట్లాడటం ఎంతో ముఖ్యం. ఉన్నత చదువుల కోసం వెళ్లే ముందే ఆర్థిక ప్రణాళిక, వీసా నిబంధనలు, ఉద్యోగ అవకాశాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలి. అత్యవసర సమయాల్లో విద్యార్థుల హెల్ప్‌లైన్‌లు, స్థానిక సమాజాల సహాయం పొందడం శ్రేయస్కరం.
సాయి ప్రదీప్ మృతి వెనుక అసలు కారణాలు అధికారికంగా తేలాల్సి ఉన్నప్పటికీ.. అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్న తెలుగు విద్యార్థులు, వారి కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ముందు ఆర్థిక ప్రణాళిక, ఉద్యోగ అవకాశాలు, వీసా నిబంధనలు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందే మార్గాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి చాటిచెబుతోంది.