'పోలవరం'లో 'పర్సనల్' ఇష్యూస్.. !
ఇదే ఎన్నికల సమయంలో ప్రభావం కూడా చూపుతోంది. తమ సాధకబాధలు విని.. పరిష్కరించే ఎమ్మెల్యేల కోసం.. స్థానిక ప్రజలు చూస్తున్నారు.
కీలకమైన పోలవరం ఎస్టీ నియోజకవర్గంలో 2009 నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరగ్గా.. ఒక్కసారి కూడా ఒకే పార్టీకి, ఒకే ఎమ్మెల్యేకు ఇక్కడి ప్రజలు పట్టం కట్టలేక పోయారు. గత నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో ప్రతిసారీ పార్టీలను, నాయకులను కూడా మార్చేస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు మారుతున్న నియోజకవర్గంగా రెండు దశాబ్దాలుగా పేరు తెచ్చుకున్న నియోజకవర్గం పోలవరం. దీనికి కారణం.. పర్సనల్ వ్యవహారాలే!.
అయితే.. ఇదేదో ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇక్కడి ప్రజల పర్సనల్ వ్యవహారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భూములు ఇచ్చిన నిర్వాసితులు.. తమకు న్యాయం చేయాలంటూ.. 2009 నుంచి ప్రభుత్వాలను కోరుతున్నారు. ఎమ్మెల్యేలపైనా ఈ ప్రభావం పడుతోంది. ఇదే ఎన్నికల సమయంలో ప్రభావం కూడా చూపుతోంది. తమ సాధకబాధలు విని.. పరిష్కరించే ఎమ్మెల్యేల కోసం.. స్థానిక ప్రజలు చూస్తున్నారు.
వైసీపీ హయాంలో ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో 2019లో ఆ పార్టీకి ఇక్కడి గిరిజనులు మొగ్గు చూపారు. తర్వాత.. కథకంచికి అన్నట్టుగానే తమ సమస్యలు అలానే ఉన్నాయి. ఇక, 2024లో మార్పు సహా.. అదేసమయంలో పోలవరం సమస్యలపై స్పందిస్తామని ఇచ్చిన హామీ కూటమికి విజయం తీసుకువచ్చింది. ఇక, గత రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొంత మేరకు మేలు అయితే జరిగింది. వైసీపీ హయాం కంటే కూడా ఇప్పుడు పోలవరం నిర్వాసితులను ఆదుకున్నారు.
అయినా ఇంకా ఆదుకోవలసిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మరో 20 వేల కోట్ల రూపాయల వరకు పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సి ఉంది. అలానే వారికి పునరావాసం కూడా కల్పించాలి. మరీ ముఖ్యంగా పోలవరం నీటి ద్వారా వస్తున్న వరదను నియంత్రించాలి. ఇవన్నీ.. ఇక్కడి ప్రజలకు పర్స నల్ ప్రాబ్లంగా మారాయి. వీటిని పరిష్కరిస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే జనసేన నాయకుడు చిర్రి బాలరాజుకు ఖచ్చితంగా మరోసారి విజయం దక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. పర్సనల్ ఇష్యూలతో రాజకీయాలు మారుతున్న నియోజకవర్గంగా అయితే పోలవరం నిలవడం గమనార్హం.