'కొండా' రివర్స్ గేర్ .. కాంగ్రెస్ ఏం చేస్తుంది ?
ఈ నేపథ్యంలో తమ మీద పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో క్రమశిక్షణ సంఘానికి కొండా సురేఖ లేఖ రాయడం రివర్స్ గేర్ వేయడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
‘నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మహిళా నేతలు అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల వెనక ఉన్న అదృశ్యశక్తులు ఎవరు ? వారిని గుర్తించి, పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలి. పార్టీ క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నోటీసుకు నేను ఇప్పటికే సమాధానం ఇచ్చాను. పార్టీ నాయకత్వం, క్రమశిక్షణా నియమావళిపై నాకు సంపూర్ఱ గౌరవం ఉంది.అయితే పార్టీ క్రమశిక్షణా సంఘం విచారణ జరుగుతున్న సమయంలో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తున్నది. వీరిని సమన్వయం చేస్తున్నది ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలిని అయిన తన మీద ఇలా సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనంగా ఉండడం తగదు. నన్ను బహిరంగంగా నిందిస్తూ, నా భవిష్యత్తు మీద తీర్పులు, ఇస్తుండడం క్రమశిక్షణా సంఘం స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా ? అనే అంశాలు కూడా పరిగణించాలి’ అని మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణా సంఘానికి తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు, పొంగులేటి, వేవ నరేందర్ రెడ్ల మీద కొండు సురేఖ కూతురు తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆమెకు పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీచేయడం, దానికి ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీభవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖను వెంటనే పదవి నుండి తొలగించాలని, ఆమె వ్యవహారశైలి, వ్యాఖ్యల మూలంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని విమర్శించారు. వీరితో పాటు పార్టీలో పలువురు నేతలు, మహిళా నాయకురాల్లు కొండా సురేఖ కూతురి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ మీద పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో క్రమశిక్షణ సంఘానికి కొండా సురేఖ లేఖ రాయడం రివర్స్ గేర్ వేయడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఇందులో తాను బలమైన బీసీ నేతను అని, తన మీద కొందరు కావాలని తీవ్ర విమర్శలు చేయిస్తున్నారని, తన కుటుంబసభ్యులను అవమానకరరీతిలో చిత్రీకరిస్తున్నారని కొండా సురేఖ పేర్కొనడం చర్చానీయాంశంగా మారింది.
మరో వైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా చిట్ చాట్ లో ‘కొండా సురేఖ కూతురు సుష్మిత పార్టీ లైన్ దాటి మాట్లాడిందని, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలు పార్టీ నియమావళికి లోబడే మాట్లాడారని’ అన్నారు. గాంధీభవన్లో 20 మంది ఎమ్మెల్యేలు నిర్వహించిన మీడియా సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో తాజాగా పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వెనకేసుకు రావడం చర్చకు దారితీస్తుంది.
ఒక వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో వైపు కొండా సురేఖ కూతురి వ్యాఖ్యలతో రాష్ట్రంలో నాలుగు రోజులుగా కలకలం రేగుతున్నది. మరోవైపు బ్రిటన్, అమెరికా పర్యటనలకు వెళ్లిన రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో లండన్ నుండే వెనక్కు వస్తున్నాడు. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం కూడా దుమారం రేగుతున్నది, అయినా ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం నుండి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఇప్పటి వరకు కొండాపై అధిష్టానం సీరియస్ అన్న ఊహాగానాలు తప్పితే, అధిష్టానంలో పెద్దగా కదలిక ఉన్నట్లు కనిపించడం లేదు. కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోనట్లయితే అయితే రేవంత్ రెడ్డికి అధిష్టానం వద్ద పట్టు సడలిందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చడం ఖాయం.