జగన్ జిల్లాల టూర్లు...స్థానిక ఎన్నికల కోసమేనా ?

అయితే స్థానిక ఎన్నికల ప్రచారంగా ఇది ఉండకుండా జిల్లాల టూర్లు పేరుతో జగన్ జనంలోకి వస్తారు అని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ పట్టణాల మీద ఫోకస్ పెడుతోంది.

Update: 2026-08-23 04:00 GMT

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జిల్లాల టూర్ల అంశం మరోసారి ప్రచారంలోకి వస్తోంది. నిజానికి 2024 డిసెంబర్ నుంచి ఇదే రకమైఅ ప్రచారం సాగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. దాని మీద అనేక డేట్లూ ముహూర్తాలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. కానీ ఏవీ నిజం కాలేదు. అయితే ఇపుడు మరో మారు ఆ ప్రస్థావన వస్తోంది. మరో రెండు నెలలలో ఏపీలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. దాంతో జగన్ జనంలోకి వెళ్తారు అని అంటున్నారు. ఒక విధంగా ఇది స్థానిక ఎన్నికల ప్రచారం కింద కూడా భావించాల్సి ఉంటుందని అంటున్నారు.

అప్పట్లో వెళ్ళనే లేదు :

ఇక జగన్ అధికారంలో ఉన్నపుడు 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అయితే జగన్ ఎక్కడా ప్రచారం చేయలేదు, స్థానికంగా జరిగే ఎన్నికల్లో ఎందుకు ప్రచారం అన్నది ఒక ఆలోచన అయితే అధికారంలో ఉన్న పార్టీ అన్నీ అనుకూలంగా ఉంటూ వస్తాయని ధీమా ఉంది. దాంతో పార్టీకి మంత్రులకు ఆ బాధ్యతలను అప్పగించారు. ఇక పవర్ చేతిలో ఉండడంతో వైసీపీకి నూటికి తొంబై శాతం స్థానిక ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. దాంతో వైసీపీ ఫుల్ ఖుషీ అయింది. ఇక తమదే 2024 ఎన్నికలు అని కూడా భావించింది. కానీ 2024 ఎన్నికలు రివర్స్ అయ్యాయి. ఇక చూస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అయితే ఎంతో పట్టుదలగా స్థానిక ఎన్నికల ప్రచారం చేశారు.

ఢీ అంటే ఢీ కొడుతూ :

అయితే ఈసారి మాత్రం జగన్ జనంలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు అని తెలుస్తోంది. అయితే స్థానిక ఎన్నికల ప్రచారంగా ఇది ఉండకుండా జిల్లాల టూర్లు పేరుతో జగన్ జనంలోకి వస్తారు అని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ పట్టణాల మీద ఫోకస్ పెడుతోంది. గ్రామీణ ప్రాంతంలో కొంత మొగ్గు తమకు ఉండొచ్చు అన్న ధీమా అయితే ఫ్యాన్ పార్టీకి ఉంది. కానీ అదే సమయంలో పట్టణాలు నగరాలలో అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయలేకపోవచ్చు అన్నది కూడా పార్టీకి ఉంది. దాంతోనే జనంలోకి వెళ్ళి రెండేళ్ళ కూటమి పాలన మీద వాస్తవాలను వివరించడం ద్వారా జగన్ వైసీపీకి ఎంతో కొంత సానుకూలత చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా మేయర్ పీఠాల మీద వైసీపీ ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు. విశాఖ విజయవాడ తిరుపతి వంటి మేయర్ పదవులకు ఎంతో ప్రతిష్ట ఉంది. దాంతో వాటిని కైవశం చేసుకోవడమైనా గట్టి పోటీ ఇవ్వడం అయినా చేస్తే వైసీపీకి భవిష్యత్తులో కూటమిని ఎదుర్కొనేందుకు మరింత సులువు అవుతుందని అంచనా కడుతోంది.

పార్టీ భేటీలో నిర్ణయం :

జగన్ జిల్లా టూర్ల మీద ఈ నెల 25న జరిగే వైసీపీ 175 మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలు కీలక నేతల సమావేశంలో చర్చిస్తారు అని అంటున్నారు. పార్టీ నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటారు అని అంటున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు, నగరాలు పట్టణాలు గ్రామాలలో వైసీపీ గ్రాఫ్ ఏ మేరకు పెరిగింది అన్నది కూడా తెలుసుకోవడమే కాకుండా పార్టీకి స్పష్టమైన దిశా నిర్దేశం కూడా జగన్ ఇస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ కూడా స్థానిక ఎన్నికలను సీరియస్ గానే తీసుకుంటోంది అని అంటున్నారు. దాంతో లోకల్ ఫైట్ సంచలనం రేకెత్తించనుంది.

Tags:    

Similar News