బ్రిక్స్ సమ్మిట్ లో ఆ నగరాన్ని కీర్తించిన బాబు

ఇదే సదస్సులో బాబు యువతకు స్పూర్తిగా నిలిచే ప్రసంగం చేశారు. సాంకేతికత ఆధారిత జీవన విధానంలో యువతలో ఒత్తిడి పెరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు.

Update: 2026-08-23 04:02 GMT

బ్రిక్స్ సమ్మిట్ విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరుగుతోంది. దీని కోసం ఏకంగా పదకొండు దేశాల నుంచి క్రీడలు యువజన సేవల మంత్రిత్వ శాఖలను చూసే మంత్రులు అంతా తరలివచ్చారు. వారికి విశాఖ ఘన స్వాగతం పలికింది. విశాఖలో పర్యాటక క్షేత్రాలను చూసి ఆహూతుల బృందం మురిసిపోయింది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రిక్స్ సమ్మిట్ కి అటెండ్ అయ్యారు. ఆయా బ్రిక్స్ మంత్రులతో కలిసి వేదికను పంచుకున్నరు. ఈ సందర్భంగా బాబు విశాఖను ఒక లెవెల్ లో ఎత్తేశారు. విశాఖ అందాలు విశాఖకు ఉన్న అవకాశాలు అన్నీ బాబు తన ప్రసంగం ద్వారా ఒక అంతర్జాతీయ సదస్సులో ప్రస్తావిస్తూ ఆఖరికి విశాఖ గురించి ఒక్కటే మాట అన్నారు. అదే సిటీ ఆఫ్ డెస్టినీ అని.

విశాఖ మెరిసింది :

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ఖ్యాతి గురించి బ్రిక్స్ సదస్సులో కొనియాడడం ద్వారా ఈ ప్రాంత పేరుని ఖండాంతరంగా వ్యాప్తి చేశారు. ఆయన బ్రిక్స్ సదస్సులో ఏమన్నారు అంటే విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్‌ డెస్టినీ గా పేరుందని గుర్తు చేశారు. అంతే కాదు భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని బాబు అభివర్ణించారు. ఒక వైపు తూర్పు కనుమలు మరో వైపు బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలు అద్భుతమని కీర్తించారు. విశాఖలో ఆర్థిక అభివృద్ధి అవకాశాలు మేళవించి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు ప్రతిభకు సంబంధించి వరుసగా రెండవ ఏడాది కూడా విశాఖ దేశంలోనే నంబర్‌వన్‌ సిటీ ఆన్‌ ద రైజ్‌గా గుర్తింపు పొందిందని బాబు బ్రిక్స్ మంత్రులకు తెలిపారు. అంతే కాకుండా మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లోనూ విశాఖకు స్థానం దక్కిందని తెలిపారు. వ్యూహాత్మక మారిటైమ్‌ గేట్‌వేగా టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌గా విశాఖ శర వేగంగా ఎదుగుతోందని చెప్పారు. సుదీర్ఘ తీరప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత ఆతిథ్యం ఇచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. వాటర్‌ స్పోర్ట్స్‌, స్పోర్ట్స్‌ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

బ్రిక్స్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ :

ఇదే సదస్సులో బాబు యువతకు స్పూర్తిగా నిలిచే ప్రసంగం చేశారు. సాంకేతికత ఆధారిత జీవన విధానంలో యువతలో ఒత్తిడి పెరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ఒత్తిడిని అధిగమించి మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి క్రీడలు యోగా, ధ్యానం దోహదపడతాయని చెప్పారు. రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. చురుకైన జీవన విధానం ఆరోగ్యకరమైన శరీరం ప్రశాంతమైన మనసు క్రమశిక్షణతో కూడిన జీవితానికి దోహదం చేస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులతో ఆరోగ్యకరమైన సమాజం, ఓ బలమైన ఉత్పాదక శక్తి కలిగిన దేశం నిర్మితం అవుతుందని బాబు గుర్తు చేశారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని చంద్రబాబు అన్నారు. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. బ్రిక్స్‌ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రతిపాదించడం విశేషం.

Tags:    

Similar News