50 గజాల్లో ఏడంతస్తుల భవనం.. కూలదా? ప్రాణాలు తీయదా?

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని మాదాపూర్‌ అంజయ్యనగర్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న భవనం కూలిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2026-08-22 21:13 GMT

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని మాదాపూర్‌ అంజయ్యనగర్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న భవనం కూలిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవలే నిర్మాణం పూర్తిచేసుకుని అద్దెకు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల ఇళ్లలో.. హాస్టళ్లలో నిద్రిస్తున్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అధికారులు, సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశారు.

కేవలం 50 గజాల్లో ఏడంతస్తుల భవనం?

ఈ ఘటనలో అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న అంశం నిర్మాణ స్థలానికి సంబంధించినదే. కేవలం 50 గజాల విస్తీర్ణంలో ఏడంతస్తుల భవనం నిర్మించినట్లు సమాచారం. ఇంత చిన్న స్థలంలో ఇంత భారీ నిర్మాణానికి అనుమతులు ఎలా లభించాయి? నిర్మాణానికి సంబంధించి నిబంధనలు పాటించారా? భవన నిర్మాణానికి ముందు మట్టి పరీక్షలు, నిర్మాణ సామర్థ్యానికి సంబంధించిన సాంకేతిక పరిశీలనలు జరిగాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

అంతేకాకుండా.. భవనం నాలాను ఆనుకుని నిర్మించడంతో నిర్మాణానికి సంబంధించిన నిబంధనలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అనుమతులు ఇచ్చే సమయంలో నిర్మాణ స్థలం, భవనం ఎత్తు, సెట్‌బ్యాక్‌లు, పునాది సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించారా అనే చర్చ మొదలైంది.

పక్క భవనంపైనా ప్రభావం

ఏడంతస్తుల భవనం కూలిపోవడంతో భారీగా శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడినట్లు సమాచారం. దీంతో అక్కడి సుమారు పది ఫ్లాట్లు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని హాస్టల్‌లో ఉన్నవారు సైతం పెద్ద శబ్దం విని బయటకు పరుగులు తీశారు.

అసలు కారణమేంటి?

భవనం కూలిపోవడానికి నిర్మాణ లోపాలా? నాణ్యత లేని మెటీరియల్‌ వినియోగమా? పునాది సమస్యలా? లేక అనుమతులకు విరుద్ధంగా నిర్మించారా? అనే అంశాలపై అధికారుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు అసలు కారణం బయటపడితేనే బాధ్యులెవరో తేలనుంది.

మరోవైపు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మాదాపూర్‌, అంజయ్యనగర్‌ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అక్రమ, అనుమతులకు విరుద్ధమైన నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. చిన్న స్థలాల్లో భారీ భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే విధానం, నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణపై కూడా సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది శిథిలాలను పూర్తిగా తొలగిస్తూ.. ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే భవనం కూలిపోవడానికి గల పూర్తి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News