సొంత ఇలాకాలో నల్లపురెడ్డి కి చుక్కెదురు ?

మరో వైపు చూస్తే ప్రశాంతి రెడ్డి బలం పెంచుకుంటూ కోవూరులో దూసుకుని పోతున్నారు. తన సొంత నిధులను వెచ్చించి మరీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది.

Update: 2026-08-23 04:04 GMT

నెల్లూరు జిల్లాలో కొన్ని రాజకీయ కుటుంబాలు తరాలుగా కొనసాగుతున్నాయి. వారి ప్రభావం ఆయా చోట్ల చాలా ఎక్కువగా ఉంటుంది. ఆనం, మేకపాటి, నల్లపురెడ్డి, నేదురుమల్లి వంటి కుటుంబాలు దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ వస్తున్నాయి. వారి కోసం ఆయా నియోజకవర్గాలు కట్టుబడిపోయాయని చెప్పాలి. పార్టీలు మారినా కూడా సీటుని మాత్రం అట్టేబెట్టుకుని తమ రాజకీయ పలుకుబడిని కొనసాగించడం పెద్ద రాజకీయ కుటుంబాలకు అలవాటు. అదే ఒరవడి ఇప్పటిదాకా సాగుతోంది. అయితే ఇపుడు ఒక రాజకీయ కుటుంబానికి సొంత ఇలాకాలోనే చుక్కెదురు అవుతోంది అని అంటున్నారు. ఆ నియోజకవర్గం కోవూరు. అక్కడ వైసీపీ ఇంచార్జిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన ఆషామాషీ నేత కాదు, రాజకీయ నేపథ్యం ఉన్న వారు. తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

బలమైన కోటగా :

నిజానికి కోవూరు నల్లపురెడ్డి కుటుంబానికి పెట్టని కోటగా ఉంటోంది. గెలిచినా ఓడినా వారి మాటకు రాజకీయ బాటకు తిరుగులేదని చెప్పాలి. ఇక్కడ నుంచి 1983లో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో కీలక శాఖలను చూశారు. ఆయన 1985లో మరోసారి గెలిచారు. ఇక ఎన్టీఆర్ తో విభేదించి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి 1988 ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నిరసన పర్యటనలు ఎన్టీఆర్ మీద చేసిన విమర్శలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఆ విధంగా టీడీపీ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించడంలో నల్లపురెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. ఆయన 1989లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా కోవూరు నుంచి గెలిచినా మంత్రి పదవి దక్కలేదు. మధ్యలోనే ఆయన మరణించడంతో ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి 1992 ప్రాంతంలో రాజకీయ అరంగేట్రం చేశారు.

టీడీపీ నుంచే సీటు :

చిత్రంగా ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయ అరంగేట్రం టీడీపీ నుంచి జరిగింది. ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఇక 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో మరో మారు గెలిచి ఎన్టీఆర్ ప్రభుత్వంలో చక్కెర శాఖ మంత్రి అయ్యారు. ఆ తరువాత అనేక సార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన 2011 తరువాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేస్తే ఓటమి ఎదురైంది. 2019లో గెలిచినా మంత్రి పదవి దక్కలేదు, 2024లో ఏకంగా భారీ ఓటమే దక్కింది. అక్కడ టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని బరిలోకి దించారు. దాంతో ఆమె చేతిలో ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి చెందారు.

బలం పుంజుకుంటూ :

మరో వైపు చూస్తే ప్రశాంతి రెడ్డి బలం పెంచుకుంటూ కోవూరులో దూసుకుని పోతున్నారు. తన సొంత నిధులను వెచ్చించి మరీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. అలాగే ఆమె క్యాడర్ కి కూడా అండగా ఉంటూ వారికి నిరంతరం అందుబాటులో కూడా ఉంటూ వస్తున్నారు. దాంతో వైసీపీకి కంచుకోట లాంటి కోవూరు ఇపుడు టీడీపీ వైపు తిరుగుతోంది. ఇక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అయితే క్యాడర్ కి అంతగా అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. అంతే కాదు మహిళా ఎమ్మెల్యే మీద ఆయన అప్పట్లో చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదం అయ్యాయి. రెండేళ్లలో వైసీపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగలేదని అంటున్నారు.

సీరియస్ డెసిషన్ తో :

ఇదిలా ఉంటే వైసీపీ అధినాయకత్వం కోవూరు అసెంబ్లీ సీటు విషయంలో సీరియస్ డెసిషన్ తీసుకుంటుంది అని అంటున్నారు. ప్రశాంతి రెడ్డి స్పీడ్ కి చెక్ పెట్టి వైసీపీ గ్రాఫ్ పెంచాలీ అంటే ఫ్రెష్ లుక్ తో కొత్త అభ్యర్ధి అన్ని విధాలుగా అంగబలం అర్ధబలం ఉన్న వారు కావాలని వైసీపీ అన్వేషిస్తోంది అని అంటున్నారు. ఇక నల్లపురెడ్డిని పక్కన పెట్టేయాలని చూస్తోంది అని ప్రచారం సాగుతోంది. అదే నిజం అయితే మాత్రం సొంత ఇలాకాలో నల్లపురెడ్డికి షాక్ తగలడం ఖాయమని అంటున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా చేతిలో ఉన్న సీటు జారితే నల్లపురెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News