చిన్న క్లూతో చిక్కేసిన సాధిక్...లేట్ అయితే చెక్కేసేవాడే !

కాకినాడ పంచాయతీ రాజ్ ఏఐ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ ని ఎట్టకేలకు కాకినాడ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు.

Update: 2026-08-23 11:45 GMT

కాకినాడ పంచాయతీ రాజ్ ఏఐ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ ని ఎట్టకేలకు కాకినాడ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. నూకరాజు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి సాధిక్ ఖాన్ కారకుడు అన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయింది. దాంతో ఈ నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చూస్తే వేరే లెవెల్ అని చెప్పాల్సిందే. ఎక్కడా ఫోన్ చేయకుండా డిజిటల్ ఆర్ధిక లావాదేవీలు చేయకుండా అయిదు రోజుల పాటు గడిపాడు. ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు. వామ్మో వీడు సామాన్యుడు కాడు అన్నట్లుగా నిందితుడు స్టోరీ ఉంది. అయిదు రోజులలో ఏకంగా నాలుగు రాష్ట్రాలను దాటేసిన ఈ నిందితుడు జస్ట్ కొన్ని గంటలు పోలీసులు ఆలస్యం చేస్తే కచ్చితంగా విదేశాలకు పారిపోయేవాడు. కేరళ నుంచి సముద్ర మార్గం గుండా విదేశాలకు చెక్కేసేందుకు పకడ్బంధీగా స్కెచ్ గీసిన సాధిక్ ఖాన్ ని ఎంతో చాకచక్యంగా కాకినాడ జిల్లాకు చెందిన పోలీసులు ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో అదుపులోకి తీసుకున్నారు. సినిమా ఫక్కీలో సాగిన సాధిక్ ఖాన్ పరారీ ఉదంతాన్ని పోలీసులు ఎట్టకేలకు చేదించారు. అతన్ని కాకినాడకు తీసుకుని వస్తున్నారు. సోమవారం కోర్టులో హాజరు పరచేందుకు రంగం సిద్ధం చేశారు.

ప్రధాన నిందితుడిగా :

ఇదిలా ఉంటే కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలో దూకి సామూహికంగా ఆత్మహత్యలకు పాల్పడిన కేసుకు సంబంధించి రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. సాధిక్ వేధింపులు బ్లాక్‌మెయిల్ తట్టుకోలేకే తాము ప్రాణాలు తీసుకుంటున్నట్లు నూకరాజు ఆయన కూతురు సౌజన్య రాసిన లేఖలు పోలీసుల దర్యాప్తులో వెంటనే వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నెల 16న నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం తెలిసిన వెంటనే సాధిక్ ఖాన్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న అర్ధరాత్రి సాధిక్ మాట్లాడిన ఒక ఫోన్ కాల్ అతన్ని పట్టించింది. ఇక అదే రోజు అర్ధరాత్రి సామర్లకోట జంక్షన్ లో కోణార్క్ ట్రైన్ ఎక్కిన సాధిక్ ఖాన్ అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని కాకినాడలోని ఒక న్యాయవాదికి తన సోదరికి ఫోన్ చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. దీంతో ఈ నంబర్ ని ట్రాక్ చేసి మాట్లాడిన కాకినాడ పోలీసులకు అక్కడే సరిగ్గా క్లూ మొత్తం దొరికింది.

ఎక్కడెక్కడికి వెళ్ళాడన్నది :

ఇక సాధిక్ ఖాన్ కర్ణాటకలోని వాడి రైల్వే స్టేషన్ లో సాధిక్ ఖాన్ దిగి ఉండవచ్చని కూడా పోలీసులు ఆలోచించి ఆ దిశగా దర్యాప్తుని ముమ్మరం చేశారు. వాడి స్టేషన్ లో సీసీ కెమెరా ఫుటేజీలని కూడా వారు పరిశీలించారు. కర్ణాటకలోని వాడి రైల్వే స్టేషన్‌లో సాధిక్ ఖాన్ కదలికలపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. అక్కడ ఒక స్థానికుడితో సాధిక్ ఖాన్ మాట్లాడినట్లుగా గుర్తించారు. దాంతో పోలీసులు అతన్ని ఆరా తీయగా షోలాపూర్ వెళ్లే బస్సుల కోసం ఆరా తీసినట్లుగా చెప్పాడు. ఇక షోలాపూర్ వెళ్లిన పోలీసులు సాధిక్ ఖాన్ పాత ఫోన్ నంబర్ల మీద పూర్తి నిఘా ఉంచారు. అక్కడ ఒక ఫ్రెండ్ వివరాలను సేకరించి అతన్ని ప్రశ్నించడంతో సాధిక్ ఖాన్ పూర్తి కదలికపైన ఒక క్లారిటీ వచ్చింది. ఒక లాడ్జిలో ఉండేందుకు తాను సహాయం చేశాను అని సదరు ఫ్రెండ్ చెప్పడంతో పోలీసులకు మరింత క్లూ దొరికింది. ఇక ఢిల్లీ మీరట్ పోలీసుల సాయంతో అక్కడ గాలింపు చర్యలను పోలీసులు వేగవంతం చేశారు. దాంతో సాధిక్ ఖాన్ కి ఆశ్రయం కల్పించిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఇక పోలీస్ పద్ధతిలో అతన్ని ప్రశ్నించేసరికి సాధిక్ ఖాన్ వివరాలు మొత్తం చెప్పేశాడు. వెంటనే సాధిక్ ఖాన్ ని పట్టుకుని మీరట్ కోర్టులో పోలీసులు హాజరు పరచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ మీద కాకినాడకు తరలించినట్లుగా తెలుస్తోంది. ఇక సాధిక్ ఖాన్ ని సోమవారం కాకినాడ కోర్టులో హాజరు పరచేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

ఉల్లిక్కి పరచిన ఉదంతం :

ఇదిలా ఉంటే ఏఇ నూకరాజు కుటుంబం సామూహిక అత్మహత్య రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆగస్టు 16న రాజమండ్రి గోదావరి వంతెనపై నూకరాజు కుటుంబం నదిలో దూకింది.ఈ ఘటనలో నూకరాజు, ఆయన భార్య మీనా కూతురు సౌజన్య మృతి చెందగా 10 ఏళ్ల మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. సాధిక్ ఖాన్ తనను వేధించాడని మతం మారాలని బలవంతం చేశాడని సౌజన్య లేఖలో ఆరోపించింది. సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి మృతి వెనుక కూడా సాధిక్ ప్రమేయం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు సాధిక్ ఖాన్ ప్రధాన నిందితుడు అని పోలీసులు గుర్తించడమే కాదు పక్కా సమాచారంతో పకడ్బందీ యాక్షన్ తో త్వరగానే పట్టుకోవడం విశేషం.

Tags:    

Similar News